విపక్షాలు ఎలా పోటీ చేయాలో చెప్పే హక్కు లేదు: జగన్ పై నారాయణ ఫైర్
జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఒక్క సమ్మిట్ నిర్వహించి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదన్నారు.
తిరుపతి: విపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలో, విడి విడిగా పోటీ చేయాలో ఆ పార్టీల ఇష్టమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.మంగళవారంనాడు తిరుపతిలో సీపీఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్న జగన్ విపక్షాలు బయటకు వస్తే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీతో ఏ పార్టీ కలిసి పోటీ చేయాలో ఆ పార్టీల ఇష్టమని ఆయన తెలిపారు. . విపక్షాలు ఎలా ఎన్నికలకు వెళ్లాలో చెప్పే హక్కు జగన్ లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఒక్క సమ్మిట్ ను నిర్వహించి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా జగన్ చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. జగన్ ను పారిశ్రామికవేత్తలు నమ్మే పరిస్థితిలో లేరని నారాయణ చెప్పారు. జగన్ సర్కార్ కు ఏడాది సమయం మాత్రమే ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత ఏపీ రాష్ట్రంలో రియల్ ఏస్టేట్ వ్యాపారం దెబ్బతిందన్నారు.రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో రాజధానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది.