సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. చేతిలో అధికారం ఉందని జగన్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తారా అని ప్రశ్నించారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినా సీఎం జగన్‌కు బానిస బతుకు అవసరమా అని ప్రశ్నించారు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. చేతిలో అధికారం ఉందని జగన్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తారా అని ప్రశ్నించారు. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతారని ప్రశ్నించారు. కేంద్రం కూడా ఆమోదించబట్టే.. గవర్నర్ ఇలాంటి నిర్ణయాలపై సంతకాలు చేస్తున్నారని అన్నారు. తానే గవర్నర్‌గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు అయినా వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అవి కూడా రావని అన్నారు. బీజేపీ సహకరించాలని భావించిన కేసీఆర్‌నే ముంచాలని చూశారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంట్ షాక్ ఇచ్చారన్నాని అన్నారు. జిల్లాల పునర్విభజన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని నారాయణ ఆరోపించారు. సీఎం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపలేదని విమర్శించారు. జిల్లాల ఏర్పాటు జగన్ సొంత వ్యవహారం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జగన్ పాలనపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నారాయణ స్పష్టం చేశారు.

అక్టోబర్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నట్టుగా తెలిపారు. కేరళలో అక్టోబర్ 14 నుంచి జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టాల్సి ఉందన్నారు. రాజకీయపరమైన పోరాటం ద్వారా అవినీతిని ఎదుర్కోవాలన్నారు. ఎర్ర జెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఐ, సీపీఎం కలవాలన్నారు. కేరళలో జరిగే సభలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. సీపీఎం, సీపీఐ కలిసేలా తీర్మానం చేస్తామన్నారు.