అమరావతి: కరోనా మందు ఇస్తున్న బొనిగె ఆనందయ్య తనకు ఫోన్ చేశారని సిపిఐ నేత నారాయణ చెప్పారు. అయితే, ఎక్కడున్నారంటే సమాధానం చెప్పడం లేదని ఆయన అన్నారు. కార్పోరేట్ సంస్థల ఒత్తిడితో ప్రభుత్వం ఆనందయ్యను నిర్బంధించిందని ఆయన అన్నారు.

కావాలంటే ఆనందయ్య మందుపై పరిశోధనలు చేసుకోవాలని, అంతే గానీ నిర్బంధించడం సరి కాదని ఆయన అన్నారు. ఆనందయ్యను ఆచూకీ విషయంలో తాను కోర్టులో పిటిషన్ వేస్తానని నారాయణ చెప్పారు. 

ఇదిలావుంటే ఆనందయ్య మందుపై ఈ రోజు సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్న క్రమంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో వేలాది మంది ఆయన మందు కోసం బారులు తీరడం ప్రారంభించారు. ఈ స్థితిలో ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రదేశంలో కొంత కాలం ఉంచారు. ఆ తర్వాత భార్య ఒత్తిడితో కృష్ణపట్నం తీసుకుని వచ్చారు. 

ఆ మర్నాడే మళ్లీ ఆయనను, ఆయన భార్యను రహస్య ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం ఆనందయ్య ఎక్కడున్నారనేది స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి.