తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2 జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. 

కేంద్రంలోకి టీకా పొందే వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. టీకాను ఇవ్వడం మినహా ఇతర కార్యక్రమాలన్నింటినీ చేపట్టారు. 

కరోనా టీకా పంపిణీలో భాగంగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో మూడు చొప్పున ఎంపిక చేసిన 39 కేంద్రాల్లో ఈ డ్రైరన్‌ ప్రక్రియ కొనసాగింది. 

ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల ఫోన్లకు శుక్రవారం రాత్రికే తెలుగులో మెసేజ్ వచ్చింది. మిగిలిన జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో మరోసారి డ్రై రన్‌ నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ఎంపికచేశారు.