విజయవాడ : కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రైరన్‌ ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని సంయుక్త కలెక్టర్‌ శివశంకర్‌ చెప్పారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని ఆయన వివరించారు. కొవిన్‌ పోర్టల్‌ పనితీరు బాగుందని జేసీ స్పష్టం చేశారు. 

పోలింగ్‌ తరహాలో డ్రైరన్‌ ప్రక్రియ చేపట్టామన్నారు. టీకా డ్రైరన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. కేంద్రం సూచనలతో వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతామన్నారు. ఇకపై సమాచార విశ్లేషణ చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. 

డ్రైరన్‌కు సంబంధించిన నివేదికలను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్‌ పీహెచ్‌సీలలో డ్రైరన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

వ్యాక్సినేషన్‌ మెరుగుకు చర్యలు : కలెక్టర్‌ ఇంతియాజ్

కంకిపాడు మండలం ఉప్పులూరులో డ్రైరన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు. చిన్న ఇబ్బందులు మినహా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ సజావుగా సాగిందని తెలిపారు. సాంకేతికంగా కొవిన్‌ పోర్టల్‌ బాగానే పని చేసిందని ఆయన వివరించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల అనుభవాలు సేకరిస్తున్నామన్నారు. మొత్తం ప్రక్రియపై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు. డ్రైరన్‌ అనుభవాలను బట్టి వ్యాక్సినేషన్‌ మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు.