ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కల్లోలం కొనసాగుతోంది. భారీగా కేసులు పెరుగుతుండటంతో అన్ని రంగాలు మరోసారి ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దర్శనాలకు సంబంధించి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా విజయవాడ దుర్గగుడిలోనూ భక్తుల దర్శనాలపై ఆంక్షలు తీసుకొచ్చింది.

దీని ప్రకారం.. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. అలాగే ఇంద్రకీలాద్రిపై మాస్క్ ధరించకుంటే రూ.200 జరిమానా విధిస్తామని ఈయన హెచ్చరించారు. 

రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అత్యవసరమైతే తప్పా ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దని శ్రీశైలం ఈవో రామారావు కోరారు. శ్రీశైల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. 

Also Read:కరోనా మృత్యుకేళి... దుర్గగుడి అర్చకుడి మృతి

తహశీల్దార్ ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థాన పరిధిలో మధ్యాహ్నం నుండి వర్తక వ్యాపారాలు పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్లు రామారావు చెప్పారు. ఆలయ ప్రవేశం మెదలు భక్తులు బయటకు వచ్చే వరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

క్యూలైన్ల వద్ద థర్మల్ గన్‌తో స్క్రీనింగ్ చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సిందిగా ఈవో రామారావు కోరారు.