ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో సమాధానాలు ఇవ్వాల్సింది ఆదేశించింది. ఇంతకీ విషయం ఏమిటంటారా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న నారాయణ, శ్రీ ఛైతన్య విద్యాసంస్దల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అందరకీ తెలిసిందే. పై రెండు కళాశాలల్లో గడచిన మూడున్నరేళ్ళల్లో సుమారు 70 మంది పిల్లలు మరణించి ఉంటారు. దాంతో విషయం బాగా సీరియస్ అయ్యింది. ఎంతమంది పిల్లలు మరణిస్తున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనబడలేదు.

అందుకు కారణమేమిటంటే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు నారాయణ, చైతన్యరాజు సిఎం చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితులు కావటమే. నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి కూడా. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు. అందుకే పై రెండు కళాశాలలపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

ఆమధ్య వరుసగా ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటంతో రెండు రాష్ట్రాల్లోని విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టాయి. దాంతో స్వయంగా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి తూతూ మంత్రంగా హడావుడి చేశారు. అయితే, ఇంత వరకూ ఎవరిపైనా ఎటువంటి చర్యలు లేవు.

దాంతో ప్రకాశం జిల్లాకు చెందిన లోక్ సత్తా ఆందోళ సమితి కో-కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ కోర్టుకు ఓ లేఖ రాశారు. విద్యార్ధుల బలవన్మరణాలపై కోర్టు సీరియస్ అయ్యింది. తనకు అందిన లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా కోర్టు పరిగణిస్తూ విచారణ చేపట్టింది. దాని పర్యవసానమే విద్యాసంస్ధల యాజమాన్యాలకు, ఇంటర్మీడియట్ బోర్డులకు, రెండు ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో సమాధానాలు ఇవ్వాలంటే ఆదేశించింది.