వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు తీవ్రమైన ఆరోపణలు చేసింది. అక్టోబర్ నుండి చేయాలనుకుంటున్న పాదయాత్రకు వీలుగా వ్యక్తిగత హాజరు నుండి తనను మినహాయించాలని జగన్ కోర్టులో పిటీషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే కదా? ఆ పిటీషన్నే కోర్టు గురువారం కోర్టు తోసిపుచ్చింది. పిటీషన్ అంగీకరించటమా, తోసిపుచ్చటమా అన్నది కోర్టు పరిధిలో ఉన్న అంశమన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.  

కానీ పిటీషన్ తోసిపుచ్చిన సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలే ఆశ్చర్యంగా ఉంది. జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక అభియోగాలు కాబట్టి వ్యక్తిగత హాజరునుండి మినహాంపు సాధ్యం కాదని తేల్చేసింది. ప్రతీ శుక్రవారం కోర్టుకు రావాలన్న షరతుపైనే బెయిలు మంజూరు చేసినట్లు గుర్తుచేసింది. మినహాయింపుతో స్వేచ్చను జగన్ దుర్వినియోగం చేస్తారని అనుమానించింది.

పై అభియోగాలన్నీ ఒక ఎత్తైతే ‘వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు పొందేందుకే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్లుంది’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. పాదయాత్ర పేరుతో నాలుగేళ్ళ తర్వాత వ్యక్తిగత మినహాయింపు కోరుతున్నారంటూ జగన్ పిటీషన్ పై న్యాయస్ధానం అభిప్రాయపడింది. ఆర్ధిక నేరాలు దేశ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. క్విడ్ ప్రో కో కేసుల్లో బెయిలు పొందిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా జగన్ న్యాయవాదికి గుర్తుచేసింది.

ఈ విషయంలో క్రింది కోర్టులు మినహాయింపు పిటీఫన్లను ఎప్పుడూ తోసిపుచ్చలేదు కదా? అని న్యాయమూర్తి జగన్ న్యాయవాదిని ప్రశ్నించారు. కాబట్టి అవసరమైనపుడు క్రిందికోర్టు నుండే మినహాయింపులు తెచ్చుకోండని సలహా ఇచ్చారు. పైగా జగన్, ఇతర నిందుతులు రకరకాల సెక్షన్ల క్రింద పిటీషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణమవుతున్నట్లు కోర్టు అభిప్రాయపడటం గమనార్హం. పిటీషన్ను కోర్టు తోసిపుచ్చిన నేపధ్యంలో పాదయాత్రపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.