చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. క్షుద్రపూజలు చేసి తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా చంపేశారు. తల్లిదండ్రులు విద్యావంతులే. కానీ క్షుద్రపూజల మాయలో పడి ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టారు. 

చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలో గల శివనగర్ లో ఆదివారం రాత్రి ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అందించారు. 

శివనగర్ కు చెందిన ఎన్. పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. వారికి అలేఖ్య (27), సాయిదివ్య (22 అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

వారిలో పెద్ద కూతురు అలేఖ్య భోపాల్ లో పీజీ చేస్తోంది. చిన్న కూతురు బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. కుటుంబ సభ్యులంతా నిరుడు ఆగస్టులో శివనగర్ లో కట్టిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరుచుగా పూజలు చేసేవారని అంటుారు. 

ఆ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో నిర్వహించి తొలుత చిన్నకూతురును శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్ద కూతురు నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్ తో కొట్టి చంపేశారు. ఈ విషయానని పురుషోత్తంనాయుడు తాను పనిచేస్తు్న కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పాడు. దీంతో అతను ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

హత్యకు గురైనవారితో పాటు హంతకులు కూడా దైవభక్తిలో లీనమై పోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ అన్నాైరు. తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపిందని, ఆ సమయంలో తండ్రి పురుషోత్తంనాయుడు అక్కడే ఉన్నాడని డిఎస్పీ చెప్పారు. 

తల్లిదండ్రులు కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామని, వారు అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రతంత్రాలకు అలవాడు ఆ దారుణానికి ఒడిగట్టారని అన్నారు.

హత్యకు ముందు పెద్ద కూతురికి సగం గుండు కొట్టించారు. ఇంట్లో ఆద్యాత్మిక పుస్తకాలు దండిగా ఉన్నాయి. కలియుగం అంతమైంది, సత్యయుగం ప్రారంభమవుతుందని తల్లి పద్మజ అంటున్నారు. భక్తి మత్తులో మునిగిపోయిన కూతుళ్లు కూడా ఏ మాత్రం ప్రతిఘటించలేదని అర్థమవుతోంది. యువతుల దేహాలు కూడా నగ్నంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఇంటి మిద్దె మీద తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్క రోజు ఆగితే తమ కూతుళ్లు బతికి వస్తారని వారు చెబుతున్నారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోకి ఎవరినీ రానీయకుండా పూజలు, క్రతువులు చేస్తూ వచ్చారు.