వాళ్లిద్దరూ భార్యభర్తలు. ఇద్దరూ దొంగతనాల్లో ఆరితేరారు. తొలుత.. బైకులు దొంగతనం చేసేవారు.  ఆ తర్వాత చాకచక్యంగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. తమకు అద్దెకు ఇల్లు కావాలని.. తాము హెచ్ఐవీ బాధితులమని.. తమకు ఎవరూ ఇళ్లు ఇవ్వడం లేదంటూ సింపతీ వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేసి చాలా తెలివిగా చోరీలు చేసేవారు. కాగా.. తాజాగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసారావుపేట, శివ సంజీవయ్య కాలనీకి చెందిన కత్తి రవికుమార్(25) కి  చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడం అలవాటు. కొన్ని సంవత్సరాల క్రితం గీతాంజలి(21) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో కలిసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు.  పలు ప్రాంతాలు మారుతూ.. ఇద్దరూ కలిసి చాలా ఇళ్లల్లో కన్నం వేయడం గమనార్హం.

గుంటూరు జిల్లా నకిరేకల్లు పోలీసులు గతేడాది అతడిని అదుపులోకి తీసుకుని ఒంగోలు జైలుకు తరలించారు. 2019 సెప్టెంబర్‌ 19వ తేదీన అతడు జైలు నుంచి విడుదలై పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు భార్యతో కలిసి అనంతపురం, సింగనమల్ల, బండమీదిపల్లిలో టీ కొట్టు పెట్టుకున్నాడు. 

ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అతడు కర్నూలు, అనంతపురం జిల్లాల గ్రామాల్లో చోరీలు చేయడం మొదలు పెట్టాడు. మొదట బైకు దొంగతనం చేసేవాడు. పోలీసుల నిఘా పెరగడంతో దంపతులు ఇద్దరూ బైకుపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. ఆ తర్వాత భార్య బయట నిఘాపెట్టేది. అతడు ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. తర్వాత వారు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి మకాం మార్చారు. అక్కడే వంద చదరపు గజాల స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు.

కాగా.. ఇప్పటి వరకు వీళ్లు 17 కేసుల్లో నిందితులు. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 3 కేసుల్లో వారిని అరెస్టు చేసినట్లు డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్‌, యాదగిరి తెలిపారు. కత్తి రవికుమార్‌పై 2016 నుంచి 2018 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద ఉన్న 26 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, 2 బైకులు, టీవీలు, స్థలం డాక్యుమెంట్‌ స్వాధీనం చేసుకున్నారు.

వీరితోపాటు.. మరో ముఠాని కూడా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా.. వీరంతా కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.