తమ ఆర్థిక కష్టాలనుండి బయటపడేందుకు భార్యాభర్తలిద్దరు కలిసి స్నేహితున్ని అతి దారుణంగా చంపిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.

మచిలీపట్నం : తమ ఆర్థిక కష్టాలనుండి బయటపడేందుకు మరో కుటుంబాన్ని జీవితాంతం బాధపడేలా చేసారు కిలాడీ దంపతులు. భార్యతో కలిసి స్నేహితున్ని అతి దారుణంగా చంపి ఒంటిపైవున్న బంగారాన్ని దోచుకున్నాడు ఓ దుర్మార్గుడు. తమ ఆర్థిక కష్టాలు తీరిపోతాయని హత్యచేసారు... కానీ అలా చేస్తే తాము హంతకులమై జీవితం నాశనం అవుతుందని ఆలోచించలేకపోయారు దంపతులు.చివరకు వీరి పాపం పండి హత్య విషయం బయటపడి కటకటాలపాలయ్యారు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం... మచిలీపట్నంకు చెందిన మొహిందర్, శశికళ భార్యాభర్తలు. వీరికి రిత్విక సాయి అనే కూతురు వుంది. ఆర్థిక కష్టాల కారణంగా గత రెండు నెలలుగా ఈ కుటుంబం పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో నివాసముంటున్నారు. సొంత కారును కిరాయికి తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు మొహిందర్. కానీ ఇలా వచ్చిన డబ్బులు సరిపోక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. 

తమ ఆర్థిక కష్టాల నుండి బయటపడేందుకు మొహిందర్, శశికళ దంపతులు దారుణానికి ఒడిగట్టారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన స్నేహితుడు పురుషోత్తం ఒంటిపై వున్న బంగారంపై వీరి కన్నుపడింది. ఎలాగయినా ఆ బంగారాన్ని దోచుకుని ఆర్థిక కష్టాలనుండి బయటపడాలని అనుకున్నారు. ఇందుకోసం పురుషోత్తంను ఓ పథకం ప్రకారం అతి దారుణంగా హత్యచేసారు. 

Read More ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు కూర్చుని... భర్త కోసం మహిళ ఆందోళన (వీడియో)

పనివుందని చెప్పి పురుషోత్తంను మొగల్రాజపురం రావాల్సిందిగా ఫోన్ చేసాడు మొహిందర్. అతడి దుర్బుద్ది తెలియని ఏదయినా సాయంకోసం పిలిచాడేమోనని వెళ్లాడు. కానీ విషయమేంటో చెప్పకుండా సరదాగా మద్యం తాగుదామని చెప్పడంతో పురుషోత్తం కూడా సరేనన్నాడు. మద్యం తీసుకుని ఇద్దరూ యనమలకుదురులోని ఇంటికి వెళ్లారు. తమ పథకం ప్రకారం పురుషోత్తంతో ఫుల్లుగా మందుతాగించిన దంపతులు కరెంట్ వైరు గొంతుకుచుట్టి చంపేసారు. అతడి ఒంటిపై వున్న నగలను తీసుకుని ఓ అద్దెకారులో శవాన్ని రాజమండ్రి వద్దగల దవళేశ్వరం బ్రిడ్జి పైనుండి గోదావరి నదిలో పడేసారు. 

అయితే పురుషోత్తం కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మొహిందర్, శశికళ దంపతులు బంగారంకోసం అతన్ని చంపినట్లు బయటపడింది.