పాతకాలం నాటి నాన్ వెజ్ వంటలతో ఆంధ్రా రుచులను ప్రపంచానికి పరిచయం చేసిన యూట్యూబ్ సంచలనం...కంట్రీఫుడ్స్ మస్తానమ్మ ఇక లేరు. వయసు సంబంధింత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామంలో కన్నుమూశారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడకు చెందిన మస్తానమ్మ వంటలు అద్భుతంగా చేస్తుంది. ఇంత వయసు వచ్చినా తానే స్వయంగా వంట చేసుకుని తినడంతో పాటు అందరికీ తినిపిస్తుంది. ఈమె మనవడికి వచ్చిన ఒక ఐడియా మస్తానమ్మను సెలబ్రిటీ చేసింది.

ఆరు బయట.. రాళ్లపొయ్యి మీద మాంసాహార, శాఖాహాక వంటలు చేయించి... వాటిని వీడియో తీయించి.. యూట్యూబ్‌లో పెట్టేవాడు..2016 ఆగస్టు 19న తొలిసారిగా పోస్ట్ అయిన తొలి వీడియోకి భారీగా లైకులు వచ్చాయి. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఆమె మనవడు లక్ష్మణ్ ‘‘కంట్రీఫుడ్స్’’ పేరిట తన బామ్మ చేసిన వంటకాల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు.

పుచ్చకాయ చికెన్, కబాబ్, మటన్, చికెన్‌లతో వెరైటీ కూరలు, ఘుమఘుమలాడే బిర్యానీలు, రొయ్యలు, పీతల వంటకాలు, ఇతర రకరకాల శాకాహార వంటకాలను మస్తానమ్మ ప్రపంచానికి రుచి చూపించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది మస్తానమ్మకు అభిమానులుగా మారారు.

ప్రస్తుతం కంట్రీఫుడ్స్‌కు 1.20 లక్షల మంది సబ్‌ స్క్రైబర్స్ ఉన్నారు. గత ఏడాది కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె 106వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.