అమరావతి: పీపీఏల విషయంలో అధికార వైఎస్ఆర్‌సీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఒకరిపై మరోకరు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు.వైఎస్ జగన్ కు చెందిన సండూర్ పవర్ సంస్థ యూనిట‌్ కు రూ. 4.50లకు ఎందుకు విక్రయిస్తోందని లోకేష్ ప్రశ్నించారు.

 

ట్విట్టర్ వేదికగా  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ రాష్ట్రంలో యూనిట్‌కు ఎక్కువ ధరకు చంద్రబాబునాయుడు సర్కార్ విద్యుత్ ను కొనుగోలు చేసిందని  విమర్శలు చేస్తున్న జగన్ కర్ణాటకలో యూనిట్‌  విద్యుత్ ను రూ.4.50లకు ఎందుకు విక్రయిస్తున్నారని ఆయన ప్రశ్నించారు

మీ జేబులో డబ్బులు వేసుకొనేటప్పుడు ఇది ప్రజాధనం అని గుర్తుకు రావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. థర్మల్ పవర్ తక్కువ రేటుకే కదా ఎందుకు వాడుకోకూడదని వాదిస్తున్న మీ తెలివి తేటలకు తనకు నవ్వొస్తోందన్నారు. 

 ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకొందన్న విషయం మీకు తెలియకపోవడం మా దురదృష్టమని లోకేష్ సెటైర్లు వేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను చంద్రబాబునాయుడు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ సంస్థను  గట్టెక్కించిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబునాయుడు కష్టాన్నే జగన్ తండ్రి ఉచిత విద్యుత్తు అంటూ సోకు చేసుకొన్నారని ఆయన మండిపడ్డారు. 2009 ఎన్నికలకు ముందు యూనిట్ విద్యుత్ ను రూ. 16లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనుగోలు చేశారని లోకేష్ ప్రస్తావించారు.

యూనిట్ విద్యుత్ ను రూ. 16లకు కొనుగోలు చేయడం వల్ల రూ. 6,600 వేల కోట్లు డిస్కంలకు బకాయిలు పెట్టడంతో.... సంస్థలను వైఎస్ రాజవేఖర్ రెడ్డి దివాళా తీయించారని ఆయన ఆరోపించారు. 

విద్యుత్ సంస్థలను నష్టాల నుండి బయలకు లాగేందుకు చంద్రబాబునాయుడు సర్కార్ ప్రయత్నాలు చేసిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. 2015 లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 8892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేసినట్టుగా తెలిపారు.  2015-16 లో యూనిట్ విద్యుత్ ను రూ. 4.63లకు కొన్న విద్యుత్ ను 2018-19 లో రూ. 2.72లకు కొంటున్నామన్నారు. 

పాత ధరల ఆధారంగానే విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసినట్టుగా చెబుతున్న వైఎస్ జగన్... ఆయన స్వంత కంపెనీ సండూర్ పవర్ సంస్థ కర్ణాటకలో విద్యుత్ సంస్థకు రూ.4.50లకు ఎందుకు విక్రయిస్తోందని ఆయన ప్రశ్నించారు.