Asianet News TeluguAsianet News Telugu

పత్తి రైతులకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు మేలు చేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పత్తి రైతులకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. పత్తి నాణ్యతను పెంచడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, జ్యూట్, కాటన్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించడం లాంటి అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు.

Cotton Farmers Get Support: AP Ministers Announce New Initiatives to Boost Cotton Production GVR
Author
First Published Aug 28, 2024, 7:23 PM IST | Last Updated Aug 28, 2024, 7:23 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు స్పష్టంచేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.

Cotton Farmers Get Support: AP Ministers Announce New Initiatives to Boost Cotton Production GVR

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పత్తిలో వ్యర్థాల తొలగింపు, రైతులకు అధిక ధర లభ్యంపై జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లరు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత సమావేశమయ్యారు. పత్తిలో వ్యర్థాల వల్ల ధర తగ్గుముఖంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో 2017-18లో  20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగ్గా... 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తికి తగ్గిపోయిందన్నారు.  ప్లాస్టిక్, గోనె సంచుల్లో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. దీనివల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి సేకరణ సమయంలో కాటన్ సంచులు వాడకం వల్ల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడే అవకాశం ఉండదన్నారు. ఇందుకు వ్యవసాయశాఖాధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని మంత్రి సవిత సూచించారు. 

వంద శాతం ఈ క్రాప్ తో పత్తి రైతులకు మేలు : మంత్రి అచ్చెన్నాయుడు

ఈ క్రాప్ లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలన ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టంచేశారు. అదే సమయంలో ఈ క్రాప్ లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధి పొందొచ్చునని రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అంతిమంగా రైతులకు మేలు  చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వెల్లడించారు. పత్తి దిగుడులు పెంపుదల,  వ్యర్థాల నివారణపై మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితులు అధ్యయనం చేసి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జ్యూట్ సంచులు, కాటన్ సంచులు వినియోగంలోకి తీసుకురావాలని, రైతులను చైతన్యం చేసేందుకు అధికారులు, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, సీసీఐ ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పత్తి రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పత్తి సాగులో అధిక ఉత్పత్తికి మేలైన వంగడాలు రూపొందించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావన మూర్తి, వ్యవసాయాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios