Asianet News TeluguAsianet News Telugu

వైసిపి పాలనలో అధికారుల లీలలు ... డబ్బుల కోసం ఇళ్లు కట్టినట్లు కనికట్టు

వైసిపి పాలనలో తాను అధికారుల చేతుల్లో ఎలా మోసపోయాడో ఓ బాధితుడు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ కు వివరించారు. ఇళ్లు కట్టినట్లు కనికట్టు చేసారని.. అదెలాగో  వివరించాడు... 

Corruption Under YSRCP Rule: Victims Seek Help at JanaSena Grievance Office AKP
Author
First Published Aug 22, 2024, 11:51 PM IST | Last Updated Aug 23, 2024, 12:24 AM IST

Janasena Party : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్ కు భారీ స్పందన వస్తోంది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలు జనసేన ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటున్నారు. ఇలా కొద్ది రోజులుగా రోజూ ఓ జనసేన ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో వుండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇవాళ (గురువారం) అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజలనుండి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేతో అధికారుల చేతుల్లో మోసపోయానని ఫిర్యాదు చేసాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు ఇల్లు మంజూరు అయ్యింది... అయితు ఇంటి నిర్మాణం పూర్తిచేయడానికి అధికారులు రూ.35 వేలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు. ఈ డబ్బు చెల్లిస్తే నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారని... దీంతో అప్పు చేసిమరీ రూ.35 వేలు తీసుకొచ్చి కట్టానన్నారు. కానీ ఇప్పటివరకు తనకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని వెంకటేశ్వరరావు వాపోయాడు. తమకు తగిన న్యాయం చేయాలని అతడు జనసేన ఎమ్మెల్యేను కోరారు.  

ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి అనే మహిళ తన భూమిని వైసిపి నాయకులు కబ్జా చేసారని వాపోయారు. తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేసారని... ఇప్పటికే సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. తమ భూమి తమకు దక్కేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు కృష్ణవేణి. 

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర చెవిటి, మూగ జూనియర్ కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు కోరారు. బధిరుల కోసం డిగ్రీ కళాశాలను కూడా ప్రారంభించాలని బధిర విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తరువాత బధిరులు డిగ్రీ చదవడానికి అందుబాటులో ఏ విధమైన కళాశాల లేదని వాపోయారు. శ్రీ వెంకటేశ్వర కళాశాలను డిగ్రీ వరకు పెంచుతామని గతంలో చాలామంది నాయకులు హామీ ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. బధిర విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుద్దప్రసాద్ ను కోరారు.  

కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు జీవనోపాధి కింద రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కు కల్పించాలని నిర్వాసితులు కోరారు. రిజర్వాయర్ కోసం 750 మంది రైతులు నుంచి 1250 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. భూములు కోల్పోయిన వారిలో దాదాపు 548 మంది పేద రైతులే. వారికి జీవనోపాధి కింద చేపలు పట్టుకునే హక్కు కల్పించాలని  విజ్ఞప్తి చేశారు.  
 
ఇంకా పలువురు ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకొనేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. వారందరి దగ్గర నుంచి మండలి బుద్ధప్రసాద్ నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios