కోరలుచాస్తున్న కరోనా... విజయవాడలో ఆంక్షలు మరింత కఠినతరం
విజయవాడలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విజయవాడ: లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడ్డ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. ఇలా కృష్ణా జిల్లా విజయవాడలో కూడా కరోనా కోరలు చాస్తుండటంతో రేపటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి.
నగరంలోని ఆరు ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేని పూర్తి లాక్ డౌన్ తో పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాణిగారి తోట, పాత ఆర్.ఆర్.పేట, కుమ్మరిపాలెం, కుద్ధుస్ నగర్, పాయకపురం, సనత్ నగర, కానూరు, పెనమలూరు మండలాల్లో రేపటినుండి అన్నిరకాల సేవలు బంద్ కానున్నాయి. మిగిలిన చోట్ల ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ సమయం కుదిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 49, నెల్లూరు జిల్లాలో 48, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్ కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, అనంతపురం జిల్లాలో 13, తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 4గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు.. ఇక తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కోవిడ్ –19 విస్తరణ, నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:నిర్వహించారు.సమీక్షకు ముందు రాష్ట్రంలో తయారైన కోవిడ్ –19 ర్యాపిడ్ టెస్టు కిట్లను ఆయన ప్రారంభించారు.కోవిడ్ నివారణా చర్యల్లో స్వయంశక్తి దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభపరిణామమని ఆయన అన్నారు..కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణకు అత్యంత కీలకమైన కిట్ల తయారీ రాష్ట్రంలో జరుతుండడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు.రాష్ట్రానికి కావాల్సిన వెంటిలేటర్లను కూడా వీలైనంత త్వరగా అందించాలని ఆయన అన్నారు.
ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో పనులు ముందుకు సాగడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ర్యాండమ్ కిట్లు అందుబాటులోకి వచ్చినందున పరీక్షలు చేసే సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. రోజుకు 10 వేల పీపీఈ (వ్యక్తిగత భద్రత ఉపరకణాలు) కిట్ల చొప్పున వచ్చే మూడు రోజుల్లో మొత్తం 30వేల పీపీఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు.అవి కూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయని అధికారులు చెప్పారు.