అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం నుంచి ఉద్యమం కొనసాగుతుందని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. అయితే ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ప్రతి ఒక్కరు మరొకరితో 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉద్యమంలో పాల్గొంటారని నేతలు తెలిపారు. 

ప్రతి రోజు సాయంత్రం 7:30కి అమరావతి వెలుగు పేరుతో ప్రతి ఇంటి ముందు కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలపాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఉద్యమం రూపు మారుతుందే కానీ అదెప్పుడూ కొనసాగుతుందని మరోసారి నేతలు స్పష్టం చేశారు. 

read more  కరోనా భయంతో మోసపోతున్న రైతులు... దళారులకు మంత్రి కన్నబాబు వార్నింగ్

కరోనా నివారణకు ప్రధాని మోదీ చేసిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. జనతా కర్ఫ్యూకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని జేఏసీ ప్రకటించింది. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చుంటామన్నారు. ఇక వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు. ప్రధాని సూచన మేరకు తాము పాటిస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాస్తామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెప్పారు. 

రాజధాని రైతుల దీక్షా శిబిరాలపై కరోనా ఎఫెక్ట్‌ పడిన విషయం తెలిసిందే. తుళ్లూరు మహాధర్నా శిబిరానికి ఇవాళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొంత కాలంపాటు దీక్షలు, ధర్నాలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి దీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచించారు. 

read more   కరోనావైరస్ కట్టడికి పవన్ కల్యాణ్ చిట్కాలు

దీంతో రాజధాని అమరావతి జేఏసీ అత్యవసర సమావేశంలో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని రైతులు పోలీసులకు తెలిపారు. రాజధానిగా అమరాతినే కొనసాగించాలంటూ వరుసగా 94వ రోజూ(శుక్రవారం) ఆందోళనలు కొనసాగించారు. అనతరం సమావేశమై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు.