అమరావతి: వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రపంచమంతా కరోనా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినమాటలు ముమ్మాటికీ వాస్తవమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతోంది కూడా ఇదేనని మంత్రి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు మరో వినూత్న ఆలోచన చేశామన్నారు. కరోనా పేషంట్లను ట్రాక్ చేసేందుకు అధునాతన పరికరాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జీపీఎస్ మాడ్యూల్ ను రూపొందిస్తున్నట్లు... కరోనా సోకిన వ్యక్తిని నిరంతరం ట్రాక్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు అవకాశం ఉన్న చోటల్లా టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు.

 భవిష్యత్ లో ఈ మాడ్యూల్ ఉపయోగం చాలా ఉంటుందన్నారు. ముఖ్యంగా కరోనా బారిన పడినవారు నిబంధనలను ఉళ్లంఘిస్తూ క్వారంటైన్ జోన్ దాటి ఇతరప్రాంతాల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే బీఫ్ శబ్ధంతో అప్రమత్తం చేసేలా దీన్ని రూపొందిస్తున్నామన్నారు.

ఇక పరిశ్రమలలో రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతే కార్మికులను అనుమతిస్తున్నామని వెల్లడించారు. ముందుగా జాగ్రత్తలు, రక్షణ చర్యలు చేపడుతూ గ్రీన్ జోన్ లలో ఉన్న  పరిశ్రమలను పరిశీలించి అనుమతి ఇచ్చామన్నారు. 

''ఎక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనది. తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలలోనే మన రాష్ట్రం కన్నా ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. కరోనా విపత్తు సమయంలో ముందుండి పోరాడుతున్న కార్మిక యోధులకు పేరుపేరునా ముందస్తుగా 'మే డే' శుభాకాంక్షలు'' తెలిపారు. 

''కార్మికుల కష్టం, శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం మనది. శ్రీసిటీ సహా అన్ని పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు భరోసానిచ్చేలా శానిటైజర్లు, మాస్కులు, ఉష్ణోగ్రతల పరిశీలన వంటివి పక్కాగా అమలు చేస్తున్నాం. భౌతికదూరం, పౌష్టికాహారం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  ఎవరికి కష్టం వచ్చినా చలించిపోయి స్పందించే ముఖ్యమంత్రి ఉండగా ఎవరికీ ఏ ఇబ్బందీ రాదు'' అన్నారు. 

''ప్రజల ఆరోగ్యం, ఆర్థిక నష్ట నివారణ రెండింటిని బ్యాలన్స్ చేసేలా ముఖ్యమంత్రి చర్యలున్నాయి. కరోనా కట్టడికి యావత్ దేశం మెచ్చుకునే  వినూత్న,  వివేకమైన చర్యలు సీఎం జగన్ చేపడుతున్నారు. పనే తప్ప ప్రచారం కోరుకోని వ్యక్తిత్వం ముఖ్యమంత్రిది.  ఎవరు మెచ్చుకున్నా, విమర్శించినా  మా ప్రభుత్వం పనితో మాత్రమే సమాధానం చెబుతుంది'' అంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.