ఏపీలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు: 348కి చేరిన సంఖ్య, జిల్లాలావారీగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరుకుంది. పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.

Coronavirus: 19 fresh Covid-19 cases recorded in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 348 కి చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 49,  నెల్లూరు జిల్లాలో 48, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్‌ కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలలో 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, అనంతపురం జిల్లాలో 13, తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 9 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 4గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు.. ఇక తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

కోవిడ్‌ –19 విస్తరణ, నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:నిర్వహించారు.సమీక్షకు ముందు రాష్ట్రంలో తయారైన కోవిడ్‌ –19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ఆయన ప్రారంభించారు.కోవిడ్‌ నివారణా చర్యల్లో స్వయంశక్తి దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభపరిణామమని ఆయన అన్నారు..కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా వైరస్‌ నిర్ధారణకు అత్యంత కీలకమైన కిట్ల తయారీ రాష్ట్రంలో జరుతుండడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు.రాష్ట్రానికి కావాల్సిన వెంటిలేటర్లను కూడా వీలైనంత త్వరగా అందించాలని ఆయన అన్నారు.

ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో పనులు ముందుకు సాగడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ర్యాండమ్‌ కిట్లు అందుబాటులోకి వచ్చినందున పరీక్షలు చేసే సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. రోజుకు 10 వేల పీపీఈ (వ్యక్తిగత భద్రత ఉపరకణాలు) కిట్ల చొప్పున వచ్చే మూడు రోజుల్లో మొత్తం 30వేల పీపీఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు.అవి కూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయని అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా వివరాలు:

శ్రీకాకుళం జిల్లా:

– ఇప్పటి వరకు ‘కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్‌’ గా శ్రీకాకుళం.
– ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన. 
– ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్‌ కోడ్‌.
– ప్రతి 10 మందికీ ఒక కోవిడ్‌ ఆఫీసర్‌ నియామకం.
– వారి పర్యవేక్షణకు మండలానికో స్పెషల్‌ ఆఫీసర్‌.
– జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష.
–  గురువారం నుంచి వైద్యులకు మూడు రోజుల పాటు శిక్షణ.
– కరోనా వైరస్‌ కేసులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? రోగులను తీసుకురావడం, ఆస్పత్రికి షిప్ట్‌ చేయడం, వారి చికిత్స తదితర అంశాలపై శిక్షణ.
– జిల్లాలో కరోనా అత్యవసర సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు తదితర శాఖల వారందరికీ అవసరమైన సర్జికల్‌ మాస్క్‌లు.
– కొన్ని ఎన్‌–95 మాస్క్‌ లు, వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు) కావాలని అధికారులు చెప్పారు.

విజయనగరం జిల్లా:

– కరోనా లాక్‌డౌన్‌ సడలింపులో మార్పు.
–  సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఇప్పటి వరకు ఉదయం 6  గంటల నుంచి 11 గంటల వరకు అనుమతిస్తుండగా, గురువారం నుంచి ఆ సమయాన్ని గంట తగ్గిస్తున్నారు. 
– సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.
– కరోనా నియంత్రణకు మండల స్థాయి ఆరోగ్య బృందాలు ఏర్పాటు. కన్వీనర్లుగా ఎంపిడిఓ లేదా మున్సిపల్‌ కమిషనర్‌.
– కో–కన్వీనర్‌గా మండల సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ లేదా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌. వీరిద్దరూ కాకుండా సభ్యులుగా తహశీల్దార్‌ మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేదా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.
– మొత్తం నలుగురితో కూడిన ఈ బృందం జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఆధ్వర్యంలో పని చేస్తుందని ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌.
– కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడం, గ్రామ సహాయకులు, వైద్యాధికారులతో కూడిన రెండు స్థాయిల్లోని కమిటీలను పర్యవేక్షించడం, అనుమానితులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిఘా వ్యవస్థను పర్యవేక్షించడం తదితర కార్యక్రమాలన్నీ ఈ కమిటీ నిర్వహిస్తుంది. 
– నివేదికలను నేరుగా జిల్లా కలెక్టర్‌కు అందజేస్తుంది. 
– కరోనా వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్దంగా వ్యవహరించి దాదాపు విజయం సాధించింది.
– లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కూలీలు, బిచ్చగాళ్ళు, ఇతర ప్రాంతాల నుండి వచ్చి నగరంలో ఉండిపోయిన వారి సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు.
– జిల్లా వ్యాప్తంగా సుమారు 35 ఉపశమన కేంద్రాల ద్వారా అన్నార్తులకు నిత్యం భోజనం.
– ప్రభుత్వం స్వయంగా 18 రిలీఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.
– జిల్లా వ్యాప్తంగా 17 స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆశ్రయం, భోజన సదుపాయం.
– జిల్లాలో మొత్తం 554 మందికి ఈ కేంద్రాల్లో ఆశ్రయం. వీరికి భోజన సదుపాయంతో బాటు వసతి సౌకర్యం.
– మిగిలిన ఉపశమన కేంద్రాల ద్వారా సుమారు 3,170 మందికి రెండు పూటలా భోజనం.

విశాఖపట్నం జిల్లా:

– జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 20.
– ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 173
– ఛాతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితులు: 163
– గీతం ఆస్పత్రిలో ఉన్న వారు: 10
– కరోనా నెగిటివ్‌ వచ్చిన వారి సంఖ్య: 167
– ఇంకా రిపోర్టులు రావాల్సినవి: 24
– ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు: 66
– అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ సింగిల్‌ రూమ్స్‌: 500
– ఐసోలేషన్‌కు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పడకలు: 9459
– అందుబాటులో ఉన్న క్వారంటైన్‌ పడకలు: 9307
– జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులు: 2795 
– భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న వారి సంఖ్య: 35
– యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న వారి సంఖ్య: 53
– నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న వారు: 15
– గాజువాక వికాస్‌ జూనియర్‌ కాలేజీలో ఉన్న వారు: 4

తూర్పు గోదావరి జిల్లా:

– జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 670 పరీక్షలకు పంపించారు.
– వాటిలో 512 కేసులు నెగటివ్‌గా నిర్ధారణ కాగా, 11 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఇంకా 147 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17,409 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో ఉంచారు.
– 17409 మందిలో 11,560 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా, 5,650 మంది 15 నుండి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉన్నారు. మరో 199 మంది 14 రోజుల లోపు పర్యవేక్షణలో ఉన్నారు. 
– జిల్లాలో 165 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అలాగే మొత్తం 6,509 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు.
– 3442 మందిని హోమ్‌ ఐసోలేషన్‌ లోను, 13 మందిని క్వారంటైన్‌ కేంద్రాలలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.  
– జిల్లాలో 6 మండలాల్లో కరోనా పాజిటీవ్‌  కేసులు గుర్తించిన 8 ఆవాసాలను, వాటి పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ౖకట్టుదిట్టమైన సర్వైలెన్స్, పారిశుద్ద్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
– నీడ లేని అభాగ్యులు, వలస కూలీలకు దాతలు, సేవా సంస్థల సహకారంతో ఆశ్రయం, ఆహారం, త్రాగు నీరు అందిస్తున్నారు.  జిల్లా లోని 12 మున్సిపాలిటీలలో 20 షెల్టర్లు ఏర్పాటు చేసి 822 మందికి ఆశ్రయం కల్పించారు. 
– ప్రజలు రైతు బజార్లకు రావలసిన అవసరం లేకుండా నగరాలు, ముఖ్య పట్టణాలలో సంచార రైతు బజార్లు నిర్వహిస్తున్నారు.
– మరోవైపు సరుకులు ఫోన్‌ ద్వారా ఆర్డరు చేసి హోమ్‌ డెలివరీ పొందేలా జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా సమన్వయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా:

– జిల్లాలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు
– నేటి వరకు సేకరించిన నమూనాల సంఖ్య 613
– నెగిటివ్‌ వచ్చిన రిపోర్టులు 282
– ఇంకా రిపోర్టులు రావాల్సిన సంఖ్య 310
– విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారి సంఖ్య 4,821
– 28 రోజుల గృహ నిర్బంధం పూర్తి చేసుకున్న వారు 3,433 మంది
– ఇంకా గృహ నిర్బంధంలో ఉన్న వారు 1,388.
– కాగా, దొంగనావి పాలెం, సిద్ధాంతం, ఇలపర్రు, ములపర్రు దేవ, తామరాడ, రామన్నపాలెం, వడలి తదితర గ్రామాల్లో మంత్రి శ్రీరంగనాథరాజు ఆకస్మిక పర్యటన.
– ఇసుక రీచ్‌ల్లో పని చేస్తున్న వారికి కూడా ఉచిత రేషన్‌ సరకులు, రూ.1000ల ప్రభుత్వ ఆర్థిక సాయం అందిందా? అని ఆరా తీసిన మంత్రి.
– తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వలస వెళ్లినా వారి బిడ్డలకు ఉచిత రేషన్‌ సరకులు, రూ.1000ల ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని వడలి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించిన మంత్రి.

కృష్ణా జిల్లా:

– కృష్ణా జిల్లాలో ఇవాళ మరో 6 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 35కి చేరింది.
– జిల్లాలో ఇప్పటి వరకు 586 శాంపిల్స్‌ వైద్య పరీక్షలకు పంపగా, వాటిలో 366 కేసులు నెగటివ్‌గా తేలాయి. 11 కేసులు పాజిటివ్‌ రిజల్ట్‌ రాగా, ఇంకా 185 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు.
– పరిస్థితిని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
– జిల్లాలో 13 మండలాలకు చెందిన 2254 స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన 65,210 మాస్కులను జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌కు అందజేశారు.
– క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న 450 మందికి ప్రతి రోజూ ఇచ్చేందుకు జిల్లా ఫౌల్ట్రీ అసోసియేషన్‌ వారు కోడి గ్రుడ్లు, స్వర్ణభారతి ట్రస్టు వారు బాదం పప్పును అందజేశారు.
– జిల్లాలో కొత్తగా నమోదైన 6 కేసులూ విజయవాడకు సంబంధించినవే కావడంతో పోలీసులు విజయవాడలో మరింత పకడ్బందీగా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నారు.
– గుడివాడ పట్టణంతో పాటు డివిజన్‌ మొత్తం లాడ్‌ డౌన్‌ ప్రక్రియ సజావుగా జరుగుతుంది.
– డివిజన్‌ పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినా ఇప్పటి వరకు 128 మంది క్యారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారు 

గుంటూరు జిల్లా:

– జిల్లాలో తాజాగా 9 కేసులు నమోదు కావడంతో, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50కి చేరింది.
– జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 620 శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, వాటిలో పాజిటివ్‌–50, నెగెటివ్‌–424 కాగా, ఇంకా 170 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– ఢిల్లీ మత ప్రార్ధనలకు జిల్లా నుంచి వెళ్లి వచ్చిన 187 మందిలో ఇప్పటి వరకు 146 మందిని ట్రేస్‌ చేసి శాంపిల్స్‌ తీశారు.
– పాజిటివ్‌ వచ్చిన వాళ్లకి ట్రీట్మెంట్‌ ఇస్తుండగా, నెగెటివ్‌ ఉన్న 115 మంది 28 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
– జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య 68 కాగా, వాటితో పాటు 9500 బెడ్లు సిద్ధం చేశారు.
– హోం మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ఫీవర్‌ ఆసుపత్రిలో 6 ఐసోలేషన్‌ క్లినిక్‌ సెంటర్లను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా:

– జిల్లాలో మొత్తం 27 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 493 నెగిటివ్‌గా వచ్చాయి.
– హోమ్‌ ఐసోలేషన్‌లో 490 మంది ఉండగా, అబ్జర్వేషన్లో 28 రోజులు పూర్తి చేసుకున్న వారు 117 మంది.
– జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరగటంతో అధికారులు మరింత అప్రమత్తం. కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు.
– నియోజకవర్గానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుపై కసరత్తు. మండలానికి ఒక రిలీఫ్‌ సెంటర్‌.
– కరోనా వైరస్‌ రిలీఫ్‌ సెంటర్స్‌లో మంచి మెనూతో భోజన వసతి కల్పిస్తున్న అధికారులు.
– షాపుల ముందు ఖచ్చితంగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని నిర్దేశం.
– క్వారంటైన్‌ సెంటర్స్‌ బలోపేతం చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలన్న కలెక్టర్‌.

నెల్లూరు జిల్లా:

– జిల్లాలో 49 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల గుర్తింపు.
– జిల్లా వ్యాప్తంగా పక్కాగా పారిశుధ్ధ్యం అమలు చేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది.
– జిల్లాలో హోం ఐసోలేషన్‌ లో 896 మంది .
– ఆసుపత్రి హోం ఐసోలేషన్‌లో 14 మంది ఉండగా, ఆసుపత్రి క్యారంటైన్‌లో మరో 105 మంది.
– రేషన్, నిత్యవసరాలు, కూరగాయలు ఆన్‌లైన్‌లోనూ సరఫరా.
– నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలులో సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు.
– వినియోగదారుల వద్దకే మార్కెటింగ్‌ శాఖచే కూరగాయల కిట్లు పంపిణీ.
– విదేశాల నుంచి జిల్లాకు 1700 మంది రాక.

చిత్తూరు జిల్లా:

– జిల్లాలో కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల గుర్తింపు. నగరిలో ఒకటి, తిరుపతిలో రెండు కేసులు నమోదు.
– మదనపల్లి, పలమనేరు క్వారన్‌టైన్‌ సెంటర్లలో ఉన్న 93 మందికి నెగటివ్‌ రిజల్ట్‌ రావడంతో అందరినీ ఇళ్లకు పంపించారు.
– జిల్లాలో మాస్కుల కొరత లేదని అదేవిధంగా అత్యాధునిక యంత్రాలు వైద్య పరీక్షల కోసం అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్‌ వెల్లడి.
– జిల్లా వ్యాప్తంగా రెండోసారి సమగ్ర సర్వేల నిర్వహణ.
– 65 ఏళ్లు పైబడిన వారందరికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
– టీటీడీ సమకూర్చిన ప్రత్యేక బెడ్లను కరోనా వైరస్‌ బాధితుల కోసం సిద్ధం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా:

– జిల్లాలో ఈరోజు 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
– నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి లో నలుగురికి, హిందూపురంకు చెందిన ఇద్దరికి, కళ్యాణదుర్గంకు చెందిన ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.
– దీంతో ఇంతవరకు వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరిని కలిశారన్న వివరాలను అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది.
– కంటైన్మెంట్‌ స్ట్రాటజీ టీంల ద్వారా సూక్ష్మ స్థాయిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించిన కాంటాక్ట్‌ల వివరాలను వేగంగా సేకరించాలని కలెక్టర్‌ ఆదేశం.
– ఒక్కో కంటైన్మెంట్‌ స్ట్రాటజీ టీంలో ఒక సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, ఇద్దరు ఎంపిహెచ్‌వోలు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఎస్సై, ఒక వీఆర్వో.
– ఇలా 6 గురితో కూడిన 7 బృందాలు ఏర్పాటు.
– జిల్లాలో 1771 íపీపీఈ కిట్లు, 3241 ఎన్‌–95 మాస్కులు, 53,692 ఇతర మాస్కులు, 2,17,314 సర్జికల్‌ గ్లోవ్స్, 5 లీటర్ల శానిటైజర్స్‌ కేన్స్‌ 8550.. ఇంకా 2170 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం,  25 కేజీల బ్లీచింగ్‌ పౌడర్‌ బాగ్స్‌ 201 అందుబాటులో ఉంచామని అధికారుల వెల్లడి.

కడప జిల్లా:

– కడప జిల్లాలో ఇప్పటి 28 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదు.
– కడప రిమ్స్‌ బైపాస్‌ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల వసతి భవనాల్లో ఏర్పాటు చేసిన ‘ట్రాన్సిట్‌  క్వారంటైన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
– అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్‌ లో ఆడ్మిట్‌ అయ్యేవారి వివరాలను  నమోదు చేస్తున్న తీరును పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఆ కేంద్రంలో బస చేసే వారికి ఇచ్చే మెనూను పరిశీలించారు.
– లాక్‌ డౌన్‌ సందర్భంగా మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యవసర వస్తువులు ఇళ్ల వద్దకే వచ్చి అమ్మడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి.అంజాద్‌ బాషా వెల్లడి.
– నిత్యావసర సరుకులు విక్రయించే మొబైల్‌ వాహనాలను మండి బజార్‌లో ప్రారంభించిన డిప్యూటీ సీఎం.

కర్నూలు జిల్లా:

– జిల్లాలో తాజాగా మరో పాజిటివ్‌ కేసు నమోదు. 
– దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
– శాంతిరామ్‌ కోవిడ్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డాక్టర్లతో, అధికారులతో చర్చించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి.
– ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌ జమాత్‌ ప్రార్ధనలకు వెళ్లి కరోనా పాజిటివ్‌ కేసులకు గురైన వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ అయిన వారందరూ స్వచ్ఛందంగా క్వారెంటైన్లకు తరలి వచ్చేందుకు సహకరించాలని ముస్లిం మత పెద్దలను కోరిన జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌.
– ప్రభుత్వ క్వారంటైన్లలో ఎలాంటి సమస్యలు లేవని అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని భయాందోళనలకు గురి కాకుండా కాంటాక్ట్‌ అయిన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించిన జేసీ, ఎస్పీ.
– ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 505 మందిని క్వారంటైన్‌లలో ఉంచి శాంపిల్స్‌ సేకరించి అనంతపురం, తిరుపతి కరోనా లాబ్‌లకు పంపిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు.
– జిల్లాలో మాస్కులు, పీపీఈలు, శానిటైజర్ల కొరత లేదని, వైద్యులకు అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్‌.
– పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్, బఫర్‌ జోన్‌లుగా విభజించి సంబంధిత ప్రాంతాల్లో సోడియం హైపో ఫ్లోరైడ్‌ తో ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios