నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల మండలం అయ్యలూరులో కరోనా పాజిటివ్  బాధితుడి కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో గురువారం నాడు ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో తొలుత ఒక్క కేసు కూడ నమోదు కాలేదు. కానీ ఒకేసారి  75 కేసులు నమోదయ్యాయి.

అయ్యలూరు గ్రామంలో  ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ బాధితుడి కుటుంబసభ్యులను గురువారం నాడు క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు వచ్చారు. అయితే గ్రామస్తులు అధికారులను అడ్డుకొన్నారు.

కరోనా పాజిటివ్ బాధిత కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించకుండా గ్రామస్తులు అడ్డుకొన్నారు. పోలీసుల సహాయంతో అధికారులు గ్రామంలోకి వెళ్లారు. అయితే బాధితుడి కుటుంబంతో పాటు బంధువులు, గ్రామస్తులు వైద్యాధికారులను అడ్డుకొన్నారు.  దీంతో పోలీసులు చేసేదిలేక వెనుదిరిగారు.

also read:లాక్ డౌన్: 70 కి.మీ నడిచివెళ్లి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న బందరు యువతి

ఈ గ్రామాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా సోకిన కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించకపోవడంతో ఇంకా కేసులు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే విషయమై  కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. వారిని కూడ పరీక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

అయ్యలూరు గ్రామంలో చోటు చేసుకొన్న పరిస్థితిని వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అదనపు పోలీస్ సిబ్బందితో కలిసి ఈ గ్రామానికి వెళ్లి పాజిటివ్ కేసు నమోదైన కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.