అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. కేవలం ప్రజలే కాదు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో గతవారం రోజులుగా అతడిని కలిసిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో  ఆందోళన మొదలయ్యింది. 

అయితే రోశయ్య ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం మరింత ఆందోళనకరంగా మారింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో గత నెల 24వ తేదీన   జరిగిన కాపు నేస్తం కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి నాని, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర అధికారపార్టీ ఎమ్మెల్యేలు, వైసిపి కాపు నాయకులు పాల్గొన్నారు. 

read more  ఎలాంటి లక్షణాలు లేవు... అయినా నాకు కరోనా పాజిటివ్: వైసిపి ఎమ్మెల్యే వీడియో

తాజాగా రోశయ్యకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరిలోనూ ఆందోళన మొదలయ్యింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికి కూడా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. 

తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలియజేస్తూ పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే రోశయ్య ఓ వీడియో ప్రకటన చేశారు.  తనకు కరోనా లక్షణాలయిన దగ్గు, జలుబు, జ్వరం ఏమీ లేవని... సంపూర్ణ ఆరోగ్యంగా వున్నానన్నారు. కానీ కరోనా పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో హోంక్వారంటైన్ లో వున్నానని... ప్రజలకు ఇకపై ఫోన్ లో మాత్రమే అందుబాటులో వుంటానని రోశయ్య వెల్లడించారు. 

 మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 16,934కి చేరుకొగా ప్రస్తుతం 9,096 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు 7632 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

 రాష్ట్రంలోని కర్నూల్  జిల్లాలో అద్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ జిల్లాలో 2236 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1972 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1611 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. ఇక్కడ 1610 కేసులు రికార్డయ్యాయి.