విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ పై కరోనా మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగతూ ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. మొదట్లో ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ వైరస్ ప్రభావం తక్కువగా వున్నా రానురాను అక్కడకూడా తన ప్రతాపాన్ని చూపుతోంది.  తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది. 

విశాఖలోని గోపాలపట్నం బాలాజీ గార్డెన్స్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. సదరు మహిళ కేజీహెచ్ లో పని చేస్తున్నట్లు సమాచారం. ఆమె పనిచేసే  ప్రాంతంలోని ఉద్యోగులతో పాటు నివాసముండే అపార్ట్మెంట్ వాసులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
ప్రస్తుతం కరోనా బారినపడిన మహిళను ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె ద్వారా ఇంకా ఎవరికైనా ఆ వైరస్ సోకిందా అన్నదానిపై విచారణ జరుపుతున్న అధికారులు తెలిపారు. జీవిఎంసి శానిటైజరీ సిబ్బంది ఆమె నివాసమున్న అపార్ట్మెంట్ పరిసరాలతో  పాటు రోడ్లపైనా బ్లీచింగ్ పౌడర్ చల్లడమే కాకుండా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. 

గోపాలపట్నం ప్రాంతంలో లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న పోలీసులను కూడా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలెవ్వరూ భయటకు రాకుండా మరింత కట్టుదిట్టంగా భద్రత చేపట్టారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, శానిటేషన్, పోలీస్ సిబ్బంది చాలా జాగ్రత్తలు  తీసుకుంటున్నారు.