కర్నూల్: కర్నూల్‌లోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకే కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసే పైప్‌లైన్ లో లోపం ఉన్నట్టుగా కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మాత్రం అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

కర్నూల్ ప్రభుత్వాసుపత్రిని స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆసుపత్రిలో ప్రతి రోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. రోగులకు సరైన పరిమాణంలో ఆక్సిజన్ అందని కారణంగానే రోగులు మృత్యువాత పడుతున్నారని ఆసుపత్రి వర్గాలు అనధికారంగా చెబుతున్నట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.

also read:తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

కరోనా రోగులకు  వెంటిలేటర్ పై ఉన్న సమయంలో పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి నాలుగు బార్ ఆక్సిజన్ సరఫరా కావాలి.. కానీ పైప్ లైన్ లోపంలో కారణంగా  ఆక్సిజన్ కేవలం రెండు బార్ మాత్రమే సరఫరా అవుతోందని గుర్తించారు.

స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే పైప్ లైన్ ను అధికారులు మంగళవారం నాడు పరిశీలించారు. జిల్లాలో 6604 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 126 మంది మరణించారు.

ఈ నెల 19వ తేదీన 12 మంది, ఈ నెల 20వ తేదీన 14 మంది వెంటిలేటర్ పైనే మరణించారు. ఇవాళ కూడ మరో 13 మంది మరణించినట్టుగా ఆ న్యూస్ ఛానెల్ ప్రకటించింది. ఈ విషయమై సూపరింటెండ్ కు సంబంధిత సిబ్బంది ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా కూడ ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో ఈ సమస్య నెలకొందని అంటున్నారు.