కరోనా అనుమానిత లక్షణాలు ఉండంతో.. ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అయితే.. అలా ఆస్పత్రిలో చేరి వ్యక్తి  కనిపించకుండా పోయాడు. దీంతో.. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ.. అతని భార్య విలపిస్తోంది. ఈ మేరకు సదరు వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజాం పట్టణానికి చెందిన శీర శ్రీనివాసనాయుడు(52) గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కోవిడ్ అనుమానిత లక్షాలు కనపడటంతో జులై 16వ తేదీన రాజాంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అదేరోజు కోవిడ్ పరీక్ష  చేసి.. జెమ్స్ కోవిడ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో.. అక్కడికి చికిత్స నిమిత్తం తరలించారు.

అయితే.. చికిత్స అనంతరం అతనికి కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో.. డిశ్చార్జ్ చేయాలని కుటుంబసభ్యులు కోరారు. అయితే.. శ్వాస తీసుకోవడంలో ఇంకా ఇబ్బంది పడుతున్నారని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ రెండు రోజులు గడిచిన తర్వాత కూడా డిశ్చార్జ్ చేయకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బంది గట్టిగా అడిగారు.

అయితే.. జులై 17వ తేదీనే డిశ్చార్జ్ చేశామంటూ వారు బాంబు పేల్చడం గమనార్హం. దీంతో తెలిసిన అన్ని ప్రాంతాల్లో వెతకడం మొదలుపెట్టారు. క్వారంటైన్ కేంద్రాల్లో వెతికినా కూడా ఆచూకీ లభించలేదు. దీంతో.. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.