కరోనా వైరస్ మనుషుల్లోని మానవత్వాన్ని మంటకలుపుతోందని మరోసారి రుజువయ్యింది. కరోనా జాగ్రత్తలు పాటించని వారికి మాటలతో చెప్పాల్సింది పోయి ఓ కుటుంబంపై ఏకంగా దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా కరోనా కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు మితిమీరి ఓ యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.   

పోలీసుల కథనం ప్రకారం రెంటచింతల మండల కేంద్రంలో ఉంటున్న కర్నాటి యలమంద  కార్మికుడు . ఈ నెల 8వ తేదీన అతడు మాస్క్ ధరించకుండా బజారుకు వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్, సాంబ అనే నలుగురు స్థానికులు యలమందను ఈ విషయమై యలమందను మందలించారు. మాస్కు ధరించి బయటకు రావాలని సూచించారు. 

read more  తిరుమలకు వెళ్లివచ్చిన ఒకే కుటుంబంలో... ఐదుగురికి కరోనా పాజిటివ్

ఇలా యలమందకు కరోనా జాగ్రత్తలు పాటించమని చెప్పిన నలుగురు మాస్కు లేకుండా అదే మార్కెట్లో కనిపించారు. దీంతో యలమంద భార్య భూలక్ష్మి వారిని ఇదే విషయమై నిలదీసింది. దీనిపై మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది . 

ఈ క్రమంలోనే యలమంద కుటుంబంపై ఆ నలుగురు కర్రలతో దాడిచేశారు. వారికి సర్దిచెప్పడానికి యలమంద కుమార్తె ఫాతిమా (19) ప్రయత్నించారు. ఈ క్రమంలో కర్ర దెబ్బలు ఆమె తలకు బలంగా తగిలాయి . అప్పటి నుంచి జీజీహెచ్ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మరణించారు. 

ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఈ కుటుంబంపై దాడి చేసిన నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.