విశాఖపట్నం: కరోనా వైరస్ ను వ్యాప్తిచెందకుండా నియంత్రించడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం కనీసం వ్యాధిసోకిన వారిని గుర్తించడంలోనూ, ప్రకటించడంలోనూ విఫలమైందని మాజీమంత్రి, టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖపట్నంలో  కరోనా కేసులు  రోజురోజుకు పెరుగుతున్నా వాటిని బయటపెట్టకుండా వైసిపి సర్కార్ రాజకీయాలు చేస్తోందని అన్నారు. కేవలం రాజధాని కోసమే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై తప్పుడు సమాచారం బయటపెడుతున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 

''ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పును తెలుగువారి విజయంగా నేను భావిస్తున్నాను. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగులోనే విద్యాబోధన జరగాలని కోర్టు చెప్పింది. పిల్లలను ఏ మీడియంలో చదివించుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టమని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మనకు గర్వకారణం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నా'' అని అయ్యన్నపాత్రుడు అన్నాడు.  

''ఏపీ రాజధానిని విశాఖకు మార్చేందుకు అక్కడ కరోనా ప్రభావం లేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలంతా భావిస్తున్నారు. అదే నిజమైతే మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమించడు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దు .వాస్తవాలు చెప్పండి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులైనా వాస్తవాలు చెప్పాలి. ప్రజలను మోసం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు''  అనిహెచ్చరించారు.

''విశాఖ నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం,  ప్రభుత్వాధికారులు విశాఖలో కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నది నిజంకాదా?  అన్ని వర్గాల ప్రజలు, ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది వాస్తవమే అంటున్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం కరోనా వ్యాప్తి వివరాలు దాస్తే విశాఖ మాత్రమే కాదు....విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది'' అని  అన్నారు. 

''ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం అసలు కరోనా వ్యాధే లేదు, కేసులు పెరగడం లేదని ప్రజలను మోసం చేయడం సరికాదు. వాస్తవాలు దాయడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు నష్టం. వాస్తవాలు చెప్పకపోతే వ్యాధి రోజురోజుకు పెరుగుతుంది.  కరోనాపై బులిటెన్ విడుదల చేయండి'' అని సూచించారు.

''లాక్ డౌన్ వల్ల పేదలు, కూలీలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల గురించి ఆలోచించాలి. కూలి చేస్తే కానీ వారికి రోజు గడవని పరిస్థితి. ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలి. ఆపద సమయంలోనూ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేయడం దారుణం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై  ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి , ఏపీ గవర్నర్ , హైకోర్టు న్యాయమూర్తి సమగ్రమైన విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరుకుంటున్నాను'' అని అయ్యన్నపాత్రుడు తెలిపారు.