ఆ అనర్హులకూ రేషన్ సరుకులు, రూ.1000 సాయం: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా అద్దాల మేడలో ఆక్సిజన్ పెట్టుకుని వుంటున్న చంద్రబాబు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 

corona outbreak...Minister Kodali Nani Fires On  Chandrababu

విజయవాడ: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో యావత్ దేశం లాక్ డౌన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలెవ్వరూ ఆకలితో అలమటించకుండా వుండేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని... ఇప్పటికే 1.30 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు తీసుకున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) వెల్లడించారు. 

రాష్ట్రం ఆపత్కాలంలో వుండగా ప్రభుత్వం 14 లక్షల రేషన్ కార్డులు తొలగించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధంలేని ఆరోపణలతో గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కరోనా దెబ్బకు బయపడి అద్దాల మేడలో... ఆక్సిజన్ పెట్టుకుని ఉంటున్నాడని సెటైర్లు విసిరారు. అందుకే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబుకి సమాచారం తెలియటం లేదని అన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత 1.47 కోట్ల రేషన్ కార్డులపై విచారణ చేయించిందని... ఇందులో చంద్రబాబు ప్రభుత్వం 10 లక్షల కార్డులు అనర్హులుకు ఇచ్చారనే విషయం బయటపడిందన్నారు. దీంతో ఈ 10 లక్షల కార్డులను తొలగించడం జరిగిందన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సీఎం జగన్ పెద్ద మనస్సుతో గత ప్రభుత్వంలో మాదిరిగానే పాత రేషన్ కార్డుదారులకు కూడా ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 సాయం కూడా అందించారని తెలిపారు. అలాగే  రాష్ట్రంలో మరో 3 లక్షల మంది కొత్తగా  బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని... వారికి కూడా సీఎం  ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 ఆర్థిక సహయం అందించమని అదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

 సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని  అన్నారు.  చంద్రబాబులా పేదలను విస్మరించే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. పేదవాడి సంక్షేమ కోసం నిత్యం ఆలోచన చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ ఒక్కరేనని  మంత్రి కొడాని నాని కొనియాడారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios