అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అత్యున్నత పరిపాలనా విభాగమైన సచివాలయంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యాలయంలోని పలు శాఖల ఉద్యోగులుఈ మహమ్మారి బారిన పడిన విషయం  తెలిసిందే. తాజాగా మరో ఐదుగురు సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం 1555 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,814కి చేరుకొంది. 

 కరోనాతో రాష్ట్రంలో నిన్నటివరకు 277 మంది మరణించారు. కరోనా సోకినవారిలో 12,154 మంది కోలుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నిన్నటికి 11,383 యాక్టివ్ కేసులు రికార్డైనట్టుగా ఏపీ హెల్త్ బులిటెన్ తెలిపింది.

read more   కర్నూల్‌ జిల్లాలో కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

బుధవారం 9గంటల నుండి గురువారం 9గంటల వరకు 16,882 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 1555 మందికి కరోనా నిర్ధారణ అయిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,94,615 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 11,383 మంది కరోనా చికిత్స తీసుకొంటున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 53 మందికి, విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా సోకిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కర్నూల్, గుంటూరు జిల్లాల్లో ముగ్గురి చొప్పున, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరులలో ఒక్కరేసి చొప్పున మరణించారు. కర్నూల్ జిల్లాలో 2795, అనంతపురంలో 2659, గుంటూరులో 2663, కృష్ణాలో 2095, తూర్పుగోదావరిలో2062 కరోనా కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.