కర్నూల్:కరోనా భయంతో ఓ వ్యక్తి  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు.కర్నూల్ పాతబస్తీలోని కేవీఆర్ గార్డెన్ ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.కరోనా నేపథ్యంలో స్వర్ణకారుడికి సరైన పనులు లేవు. 

మార్చి నెల నుండి ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. కరోనా కోసం బుధవారం నాడు ఆయన శాంపిల్స్ తీసుకొన్నారు. కరోనా వచ్చిందని ఆయనకు అనుమానం వచ్చింది.

దీంతో స్నానం చేసి వస్తానని చెప్పి కుటుంబసభ్యులకు చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉరేసుకొన్నాడు.  అయితే కరోనా పరీక్షల ఫలితం నెగిటివ్ గా వచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకొన్న తర్వాత కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కరోనా వచ్చిందనే నెపంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. రాష్ట్రంలోని ఎక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గురువారం నాటికి రాష్ట్రంలో 23,814కి కరోనా కేసులు చేరుకొన్నాయి.గత 24 గంటల్లో 1555 కేసులు నమోదయ్యాయి.