Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచం విడాకులు కోరుకుంటే... జగన్ మాత్రం కాపురం, సహజీవనం: అచ్చెన్నాయుడు

కరోనా మహమ్మారికి తరిమికొట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

corona outbreak in AP... Kinjarapu atchannaidu  fires on ys jagan
Author
Amaravathi, First Published May 1, 2020, 6:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: కరోనా వైరస్ ను పారద్రోలేందుకు ప్రపంచమంతా శ్రమిస్తోందని... భౌతిక దూరం, లాక్ డౌన్ నిబంధనలు విధించుకుని సమాజానికి దూరంగా ఉంటోందని  మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇలా కరోనా నుండి డివోర్స్ కావాలని ప్రపంచం కోరుకుంటుంటే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు మాత్రం కరోనాతో కాపురం, సహజీవనం అంటూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

''1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అప్పటి ప్రపంచ జనాభాలో(180 కోట్లలో) పావు వంతు(50 కోట్లు) జనాభా వైరస్ బారిన పడ్డారు. సుమారు ఐదు కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నేటితో పోలిస్తే నాడు వైద్య సదుపాయాలు, టెక్నాలజీ, సాంకేతికత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. రెండేళ్లలో మహమ్మారిని తరిమేశారు. నేడు శాస్త్ర విజ్ఞానం పెరిగింది. సాంకేతికత, వైద్య రంగంలో సదుపాయాలు పెరిగాయి. కరోనాను అంతం చేసే శక్తి మానవునికి ఉందని ప్రంపంచ దేశాలన్నీ ధీమాగా ఉన్నాయి. పరిశోధనలు ప్రారంభించాయి. వైరస్ ను అంతమొందించడం ఖాయమని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పేర్కొంటున్నాయి. వ్యాక్సిన్ ప్రయోగదశలో ఉందని ప్రకటించాయి.
కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రం కరోనాను అంతమొందించడం కష్టం అనేలా మాట్లాడడం బాధ్యతారాహిత్యం, అవగాహనా రాహిత్యం కాదా.?'' అని అన్నారు. 

 ''పాలకులు ప్రజలకు భరోసా కల్పించాలే తప్ప.. భయోత్పాతం సృష్టించేలా మాట్లాడడం ఎంత వరకు సమంజసం.? కరోనాతో సహజీవనం చేయాలని చెప్పడం రాజకీయ దివాళాకోరు తనానికి నిదర్శనం కాదా. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, బుగ్గన సమర్థింపు పాలనా వైఫల్యానికి నిలువుటద్దం. తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా తప్పుబట్టడం, తప్పుడు వార్తలంటూ పేర్కొనడం బుగ్గన కు, ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమే చెల్లింది'' అని విమర్శించారు. 

''కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే  ఎంతో జాగ్రత్తగా ఉండాలని, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని ఇన్ఫోసిస్ మాజీ దిగ్గజం నారాయణమూర్తి పేర్కొంటే.. పత్రికల్లో వచ్చిన వార్తలను తప్పుబట్టడం వైసీపీ నేతల అహంకారానికి, చేతకానితనానికి నిదర్శనం. వైరస్ తో సహజీవనం అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై  ఆత్మవిమర్శ చేసుకోవాలి. కరోనా మహమ్మారిని అదుపు చేయకుండా వైసీపీ నేతలు రాజకీయ వైరస్ ను పెంచి పోషించడంతో ప్రజలకు కష్టాలు అధికమయ్యాయి. కరోనా పరీక్షలపై రోజుకోమాట మారుస్తున్న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు సిద్ధమా.?'' అని సవాల్ విసిరారు. 

''ఏపీలో కరోనా కేసులు 1403 కి చేరడం దక్షిణాదిలో మొదటి స్థానం ఆక్రమించడానికి వైసీపీ నేతల నిర్లక్ష్యం కారణం కాదా? రాష్ట్ర ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడుతున్న తరుణంలో.. కరోనా పరీక్షా కిట్లలో కూడా స్కాం చేయడం జగన్ అండ్ కో కు మాత్రమే చెల్లింది. ఛత్తీస్ ఘడ్ రూ.337కి కొన్న కిట్లను ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేయడమంటే.. అందులో జే ట్యాక్స్ లేదంటారా. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం టెస్ట్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు కిట్లను వినియోగంలోకి తీసుకొచ్చినప్పటికీ... ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు ఉంచలేదు. కనీసం టెండర్ నోటిఫికేషన్ కూడా ఎందుకు లేదు.?'' అని ప్రశ్నించారు. 

''మొదట రూ.1200కు కొనుగోలు చేసినట్లు వార్తలు రావడంతో.. లేదు రూ.770 అన్నారు. ఛత్తీస్ ఘడ్ రూ.337కే కొన్నామన్నాక రూ.630 అన్నారు. తర్వాత నాణ్యతలో తేడా, నిర్ధారణ సమయంలో ఉత్తమం అన్నారు. చివరికి రెండూ ఒకటే అని తేలడంతో ధరలు సవరించామంటున్నారు. ముందే వాస్తవ ధరల్ని ప్రకటించకుండా.. ఏకంగా నాలుగు రెట్లు పెంచి కొనుగోలు చేయడం జే-ట్యాక్స్ కోసం కాదా.?'' అని నిలదీశారు. 

''రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుండి టెస్ట్ కిట్లను నేరుగా  కొనుగోలు చేయకుండా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోదరుడి కంపెనీని మధ్యవర్తిగా ఉంచాల్సిన అవసరం ఏమిటి.? ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు రూ.337 చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు సంబంధించిన చెల్లింపు రసీదులను ఎందుకు బహిర్గతం చేయడం లేదు.? 
ప్రపంచం మొత్తం కరోనాపై యుద్ధం చేస్తుంటే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజీవనం చేసేందుకు సిద్ధపడాలని సూచించడం ద్వారా ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో సమాధానం చెప్పాలి'' అని అచ్చెన్నాయుడు నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios