విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మపై అపార నమ్మకంతో భవాని దీక్షలు చేపడుతుంటారు భక్తులు. ఈ దీక్ష విరమణ సమయంలో ఇంద్రకీలాద్రికి చేరుకుని మహిమాన్వితమైన అమ్మవారు వెలిసిన గిరి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని ఈ గిరిప్రదక్షణకు బ్రేకులు వేసింది దుర్గగుడి పాలకమండలి. 
 గిరి ప్రదక్షణను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. 

భవానీ దీక్షా విరమణ ఆన్ లైన్ స్లాట్ ను దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు ప్రారంభించారు. జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణ కోసం భక్తులు పెద్దసంఖ్యలో రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా   రోజుకు పది వేల మందిని భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. దీక్షా విరమణ రోజుల్లో ప్రతిరోజూ 9వేల ఉచిత దర్శనాలు... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిభక్తుడు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో వ్యక్తిగత ఐడి తప్పనిసరిగా తీసుకురావాలని...ఆన్ లైన్ టిక్కెట్లను www.kanakadurgamma.org వెబ్ సైట్ లో పొందవచ్చని వెల్లడించారు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతివ్వనున్నారు. అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాల్సి వుంటుంది. నదీ స్నానానికి అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపారు. 

దుర్గగుడి ఈఓ సురేష్ బాబు మాట్లాడుతూ... కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక పార్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో అమ్మవారి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.