అమరావతి:  గుంటూరు, కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అన్ని ముందోస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి  తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొనసీమ ప్రాంతం మల్కిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో విద్యార్థులను హోమ్ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో పూర్తిగా శానిటేషన్ చేయించి అన్ని జాగ్రత్తలు చేపట్టామన్నారు. 

 గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల వైద్యశాఖ అధికారులు డాక్టర్ యాస్మిన్, డాక్టర్ సుహాసిని, డాక్టర్ గౌరిస్వరరావులతో ఫోన్ లో మాట్లాడి కరోనా కేసులపై ఆరా తీసినట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు అధికం కావడంతో నివారణకు ద్రుష్టి పెట్టాలని డిఎం హెచ్వో కు సూచించారు మంత్రి.

కరోనా బాధితులకు అన్ని విధాలుగా వైద్య సదుపాయం కల్పించాలని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి అదేశించారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులకు మెడికల్ కిట్స్ అంద చేయాలని డాక్టర్ యాష్మిన్ కు సూచించారు. తెనాలిలో మునిసిపల్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని మంత్రి తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయిస్తున్నామన్నారు. 

read more  ఆంధ్రాకు అలర్ట్: ఒకే రోజు 300 మందికి పాజిటివ్.. హాట్ స్పాట్‌గా చిత్తూరు

పొన్నూరు లోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులకు ర్యాండమ్ గా కరోనా పరీక్షలు చేయాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశించారు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరు భయపడవద్ద.. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మెడికల్ టీమ్స్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని... ఇంటింటికి వెళ్లి సర్వే టీమ్స్ వివరాలు సేకరించాలన్నారు. 

జగ్గయ్యపేట ప్రాంతంలో కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్ కు తరలించామని... కరోనా సోకిన బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో 40మంది కరోనా బాధితులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. 

కొంతమంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని... అయితే వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. కరోనా సోకిన బాధితులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వైద్య సదుపాయం కల్పించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.