ఎన్టీఆర్ పేరుతో చిచ్చు పెట్టిన జగన్: నష్టనివారణకు అంబటి

Controversy over YS Jagan promise NTR name to Krishna
Highlights

 కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటన చిచ్చు రేపింది. 

విజయవాడ: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటన చిచ్చు రేపింది. ఆయన ప్రకటనపై సొంత పార్టీ నుంచే అసంతృప్తి వ్యక్తం కావడం ఓ వైపు ఉండగా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. 

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే సహించబోమని వైసిపి నేత దుట్టా రామచంద్రరావు ఇప్పటికే హెచ్చరించారు. ఎన్టీఆర్ ను ఒక్క జిల్లాకు పరిమితం చేస్తారా అని నందమూరి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నిమ్మకూరును అభివృద్ధి చేసింది నందమూరి, నారా కుటుంబాలేనని గ్రామస్థులు అంటున్నారు. విమానాశ్రయానికి వైఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ పేరు తొలగించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చేతనైతే జగన్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలావుంటే, ఎన్టీఆర్ పేరు పెట్టాలని తాము ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని, అది లీకు కావడంతో జగన్ ప్రకటన చేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుధవారం అన్నారు. ఎన్టీఆర్ కు చెందిన రామకృష్ణ థియేటర్ ను జగన్ తండ్రి వైఎస్ ధ్వంసం చేయించారని ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు. 

జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. కేసుల నుంచి బయటపడడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు.

ఈ స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు నష్ట నివారణకు పూనుకున్నట్లు కనిపిస్తున్నారు. కృష్ణా జిల్లా పేరును తొలగించబోమని, తాము అధికారంలోకి వస్తే 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తామని, అప్పుడు నిమ్మకూరు గ్రామం ఉండే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా మార్చి ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెడుతామని కూడా చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులుగా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ఆయన అడిగారు. ఎన్టీఆర్ మాస్ లీడర్, రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఆక్రమించుకున్నారని, ఎన్టీఆర్ పై గౌరవంతోనే జగన్ ఆ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. 

జగన్ ఓ ప్రకటన చేశారని, ఇంకా ఏ విధమైన ప్రతిపాదనలు వస్తాయో చూడాలని అంబటి అన్నారు. జగన్ చేసిన ప్రకటనను చంద్రబాబు హర్షించాలని ఆయన అన్నారు. 

loader