చిత్తూరు: జనసేన పార్టీకార్యకర్త సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సాకే పవన్ ఎంతలా విసిగి వేశారో అందువల్లే ఈ వ్యాఖ్యలు చేశారంటూ విరుచుకుపడ్డారు. 

పవన్ వ్యాఖ్యలపై కేసు పెడితే తనపైనా కేసులు పెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము మాటలు మాత్రమే అన్నామంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే గతంలో చంద్రబాబు నాయుడుపై ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడుని ఉరితియ్యాలంటూ సీఎం జగన్ బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలపై జగన్ పై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు జనసేనాని పవన్ కళ్యాణ్. మీరు బెదిరిస్తే బెదిరిపోయేందుకు జనసేన నాయకులు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. 

ప్రకాష్ రెడ్డి కాదు, ఏ రెడ్డి తలనైనా నరుకుతా: పవన్ సమక్షంలో సాకే పవన్ వ్యాఖ్యలు

ఆకు రౌడీలకు భయపడే పరిస్థితి ఎప్పుడో పోయిందన్నారు. నాలుకలు కోస్తాం, తాట తీస్తామంటే తాము తరిమితరిమి కొడతామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తనపై దాడి చేస్తామని వైసీపీ నేతలు అంటే తాను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

తాను చెప్పింది చెవులు రిక్కించి వైసీపీ నేతలు వినాలంటూ గట్టిగా హెచ్చరించారు. తనకు నలుగురు బిడ్డలు ఉన్నారని వారిని వదిలేసి రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ గట్టిగా హెచ్చరించారు. 

తనకు తన బిడ్డలపై కంటే సమాజంపైనే మమకారం ఎక్కువగా ఉందని తాను వారందర్నీ వదులుకుని రోడ్లపైకి వస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తిడతామంటే, కొడతామంటే ఊరుకోమన్నారు. 

తనకు భారతదేశం అన్నా, పురాతన సంప్రదాయాలన్నా ప్రాణాలు ఇచ్చేంత అభిమానమని చెప్పుకొచ్చారు. తాను వీధి రౌడీలకు ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులకు తాము భయపడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. రోడ్లపైకి తాను వస్తే వైసీపీ నేతలు తట్టుకోలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.