విస్తరణ ముందు వివాదాల్లో మంత్రులు

Controversies over ministers before expanding
Highlights

కొందరు మంత్రుల వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమవటం గమనార్హం.

మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్న నేపధ్యంలో కొందరు మంత్రులపై వివాదాలు రేగడం ఇబ్బందిగా మారింది. ఏప్రిల్ 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలోకి లోకేష్ ను తీసుకుంటున్నట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు. దాంతో మార్పులు, చేర్పులపై  పార్టీ నేతల మధ్యే ఊహాగానాలు పెరిగిపోయాయి. దాంతో మంత్రివర్గంలో ఉండేదెవరు, ఊడేదెవరనే విషయమై మంత్రుల్లోనే చర్చలు మొదలయ్యాయి. ఇటువంటి నేపధ్యంలోనే కొందరు మంత్రుల వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమవటం గమనార్హం.

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రశ్నపత్రాల లీకేజి విషయంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి నారాయణ వివాదాల్లో ఇరుక్కున్నారు. అసలే పలువురు మంత్రులను తప్పిస్తారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. దానికితోడు శాఖాపరంగా కూడా పలువురి మంత్రుల పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని చంద్రబాబు అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. మంత్రులు గోపాలకృష్ణారెడ్డి, కిమిడి మృణాళిని, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది.

కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుగానే కొడుకు లోకేష్ ను ఎంఎల్సీగా తీసుకున్నారు. దానికితోడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పలువురు మంత్రులు ప్రతిపక్ష నేతను నిలువరించటంలో విఫలమయ్యారని కూడా భావిస్తున్నారు. అంశం ఏదైనా కానీ జగన్ ప్రభుత్వంపై పూర్తిస్ధాయిలో పైచేయి సాధించారనే అభిప్రాయం జనాల్లో చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే వివాదాల్లో ఇరుకున్న మంత్రుల విషయంలో చంద్రబాబు ఏం చేస్తారన్న విషయం ఆశక్తిగా మారింది. ఏమైనా సరే నూతన మంత్రివర్గంపై లోకేష్ ముద్ర స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.

loader