వివాదాస్పద అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణను ప్రభుత్వం రివర్ట్ చేసింది. ఆయన స్ధానంలో పూర్తిస్ధాయి కార్యదర్శిగా ఢిల్లీలోని రాజ్యసభలో అడిషినల్ కార్యదర్శిగా పనిచేస్తున్న పిపికె రామాచార్యులను తీసుకొచ్చింది. పిపికె ఈనెల 8వ తేదీన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. దాంతో సత్యనారాయణ మళ్ళీ డిప్యుటి కార్యదర్శిగా రివర్ట్ అయ్యారు. 

గడచిన మూడేళ్ళుగా కార్యదర్శి ఇన్ఛార్జ్ హోదాలో సత్యానారాయణ అత్యంత వివాదాస్పదునిగా ముద్రపడ్డారు. ఆయనపై అనేక కేసులున్నాయి. ఆయన విద్యార్హతల గురించి వైసీపీ కోర్టులో కేసు కూడా వేసింది. అనేక కేసుల్లో వైసీపీ సత్యనారాయణపై పెద్ద పోరాటమే చేస్తోంది.

సత్యనారాయణను ఇన్ఛార్జ్ కార్యదర్శిగా నియామించిన విషయంలో  చివరకు చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాద్ కూడా కేసులో ఇరుక్కునే ప్రమాదం ముంచుకొచ్చింది. దాంతో వెంటనే సత్యనారాయణను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూడేళ్ల కాలంలో తమకు వ్యతిరేకంగా అధికార పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాల్లో సత్యనారాయణదే ప్రధానపాత్రగా వైసీపీ ఎప్పటి నుండో గుర్రుగా ఉంది. దేశంలో ఏ అసెంబ్లీలోనూ లేనివిధంగా రోజా ఏకంగా ఏడాది సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ నిర్ణయం వెనుక సత్యనారాయణే కీలక పాత్ర పోషించారని వైసీపీ అనేకమార్లు ఆరోపించింది.

దాంతో పాటు అధికార పార్టీ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల్లో సత్యనారాయణ సలహాలే ఉన్నాయని  తరచూ వైసీపీ మండిపడుతోంది. పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ అరెస్టుకు కూడా సత్యనారాయణ సలహానే కారణమని పలు ఆరోపణలున్నాయి.