సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం చూపించారు. వారి అత్యుత్సాహంతో ఓ కానిస్టేబుల్ గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్‌ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్‌ అభిమానుల ఓవర్‌ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రాజోలు నియోజక వర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ గురువారం రాత్రి దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ ఉదయం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.