ప్రేమిస్తున్నానని చెప్పి పదేళ్లు కలిసి తిరిగి.. వేరే అమ్మాయిని పెళ్లిచేసుకున్న ఓ కానిస్టేబుల్ ఉదంతం అనంతపురంలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా ఉరవకొండ సర్కిల్ లోని విడపనకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ బద్రినాథ్ తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి సెప్టెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీనిపై విపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంత్రాలయంలో ఓ ప్రైవేటు లాడ్జిలో వారిద్దరూ తరచూ కలిసేవారని దర్యాప్తులో తేలడంతో కేసును మంత్రాలయం సర్కిల్ పోలీసు స్టేషన్ కు బుధవారం బదలాయించారు. 

మంత్రాలయం సీఐ కృష్ణయ్య దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆయన వివరాల ప్రకారం.. బళ్లారికి చెందిన యువతితో బద్రినాథ్ పది సంవత్సరాల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ మంత్రాలయానికి వచ్చి ప్రైవేటు లాడ్జీలో ఉండేవాళ్లు. ఇటీవల సదరు కానిస్టేబుల్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 

దీంతో కానిస్టేబుల్ తనను మోసం చేశాడని గుర్తించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వారు మంత్రాలయంలో కలిసి తిరిగినట్లు కొన్ని సీసీ కెమెరాల్లో కూడా నమోదైంది. వీరు సమీప బంధువులను తెలుస్తోందని దీనిపై విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నాడు.