మహానాడును అడ్డుకునేందుకు కుట్ర.. తమ నేతల అరెస్టుపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
East Godavari district: ఈ నెల (మే) 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న మహానాడును అడ్డుకోవడానికి టీడీపీ నేతల అరెస్టు వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి కుటుంబానికి టీడీపీ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు.
TDP Mahanadu: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు అరెస్టు నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నెల (మే) 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న మహానాడును అడ్డుకోవడానికి టీడీపీ నేతల అరెస్టు వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి కుటుంబానికి టీడీపీ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు.
ఆదివారం ఉదయం అప్పారావు, వాసులను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగించారు. అనంతరం ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. జిల్లా జడ్జి వారికి మే 12 వరకు రిమాండ్ విధించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే టీడీపీ నేతలపై కుట్ర జరుగుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడును అడ్డుకోవడానికి ఈ అరెస్టు వెనుక కుట్ర ఉందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. మహానాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ఆయన అన్నారు.
తనపై కూడా అక్రమ కేసులు బనాయించారని, ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ క్యాడర్ భయపడదని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్యే భవాని, చినరాజప్ప సోమవారం సెంట్రల్ జైలుకు వెళ్లి రిమాండ్ లో ఉన్న అప్పారావు, వాసులను పరామర్శించారు. ఆదిరెడ్డి కుటుంబంపై జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అరెస్టును టీడీపీ బీసీ సాధికార సమితి (శెట్టిబలిజ విభాగం) రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, నగర అధ్యక్షుడు ఆర్.మానేశ్వరరావు, అధికార ప్రతినిధి డి.ప్రసాద్ తదితరులు ఖండించారు. సీఎం జగన్ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు ఏదో ఒక సాకుతో జరుగుతున్నాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని సత్తిబాబు విమర్శించారు. అరెస్టులను సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఖండించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు.