ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి హత్యకు కుట్ర జరుగుతుందన్న ప్రచారం విశాఖ జిల్లాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయ్యన్న కుటుంబంలోని వ్యక్తులే బయటివారితో చేతులు కలిపి మంత్రిని అంతమొందించేందుకు పథకం పన్నినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఆ వీడియోలో అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. వారు మంత్రిని హతమార్చడానికే అక్కడే సమావేశమైనట్లుగా చూపించారు. అయితే సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ దీనిని ఖండించాడు.. తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సదరు వీడియోపై సన్యాసిపాత్రుడు విశాఖ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న నర్సీపట్నం సత్యకాంప్లెక్స్‌లో తన స్నేహితుడు షేక్ అల్లా ఉద్దీన్ కుమార్తె వివాహానికి తన బంధువు చింతకాయల రమణ, గన్‌మెన్‌లతో కలిసి హాజరయ్యానని... ఆ వేడుకకు కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వచ్చారన్నారు.

వారు ఎదురుపడటంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నామని సన్యాసి తెలిపారు. ఆ సమయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ సేకరించి.. ఆ దృశ్యాలను మార్చేసి తన సోదరుడిని చంపేందుకు సమావేశమైనట్లుగా చూపించారని ఆరోపించారు.. దీని వెనుక ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సన్యాసి పాత్రుడు జిల్లా ఎస్పీని కోరారు.