ఒంగోలులో సోమవారం హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను అడ్డుకోవడంలో కుట్ర కోణం ఉందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. హోంమంత్రి కారును అడ్డుకున్న ఘటనలో 17 మందిని గుర్తించి కేసు పెట్టామన్నారు. 

ఒంగోలులో సోమవారం హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను అడ్డుకోవడంలో కుట్ర కోణం ఉందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. హోంమంత్రి కారును అడ్డుకున్న ఘటనలో 17 మందిని గుర్తించి కేసు పెట్టామన్నారు. ఆ సంఖ్య 20కి దాటే అవకాశం ఉందన్నారు. ఈ ఘటన వెనక ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మహిళలను అరెస్ట్ చేయకూడదని.. అందుకే ముందుకు అరెస్ట్ చేసిన ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. 

ఈ ఘటనకు సంబంధించి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అధికారుల విధులు ఆటంక పరచడం, అక్రమ సమూహంగా ఏర్పడటం కింద కేసులు పెట్టామన్నారు. రేపల్లె సామూహిక అత్యాచార బాధితురాలు సొంత జిల్లా కావడంతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారని నాగరాజు తెలిపారు.

ఇక, రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళ పై సామూహిక అత్యాచారాకి గురైన బాధితురాలుకు ప్రస్తుతం ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరామర్శరకు వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను అడ్డుకన్న తెలుగుదేశం మహిళ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కొమ్మూరి సుధాకర్‌ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.

హోం మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని.. 17 మంది మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనం అని విమర్శించారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం అని ఫైర్ అయ్యారు. మహిళలకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్ వద్ద నినాదాలు చేయడం నేరమా అని ప్రశ్నించారు. మహిళలు నినాదాలు చేయడం నేరం అన్నట్టు వారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గళమొత్తిన గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని ఆశించడం తప్పేనేమో అని ఎద్దేవా చేశారు. ఒంగోలులో మహిళలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలన్నారు.