అమరావతి: తనను మరోసారి అరెస్టు చేయడానికి వైసిపి సర్కార్ కుట్రలు చేస్తోందని... ఈ విషయం గురించి తనకు కొందరు మెసేజ్ లు పెడుతున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ఈ అరెస్టులకు తాను బయపడబోనని... పార్టీ కోసం ధైర్యంగా జైలుకెళ్లడానికి సిద్దమేనని అన్నారు. ఇందుకోసం ఎప్పుడూ పంచె, టీ షర్ట్ తో సిద్ధంగా ఉంటున్నానని అచ్చెన్న వెల్లడించారు.

టిడిపి నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడులో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు.  సమాజానికి సేవ చేయాలంటే టిడిపి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. టీడీపీలా పటిష్టమైన కార్యకర్తల బలం గల పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదని... స్వార్ధంతో ఎంత మంది నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు స్థిరంగా ఉన్నారన్నారు. 

''అధికారం, ప్రతిపక్షం కాదు.. ప్రజా సేవలో టీడీపీని మించిన పార్టీ ఏదీ లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ విధానాలను ఎన్నో విధాలుగా ఎండగట్టాం. మనం ఇచ్చిన సలహాలు సూచనలతో ప్రజలకు ప్రభుత్వాలు మేలు చేసేవి.ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్షంగా మనం చేరేవాళ్లం'' అని పేర్కొన్నాడు. 

read more   ఆ ప్రాజెక్టులు పూర్తవ్వడానికి వందేళ్ళు... జగన్ పాలిట శాపమదే: చంద్రబాబు సీరియస్

''గత రెండేళ్లలో దుర్మార్గుడైన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రానికి వచ్చిన మంచి పేరును నాశనం చేశారు. ఎన్నడూ లేనంతటి చెత్త పేరు తీసుకొచ్చారు'' అని మండిపడ్డారు. 

''పార్లమెంటు కమిటీల ఏర్పాటులో జాప్యం జరిగినందుకు చింతిస్తున్నాం. మహానాడు పూర్తైన 10రోజుల్లో కమిటీల నియామకం పూర్తి చేసి తీరుతాం. పార్టీ పటిష్టత కోసం పోరాటం చేసిన వారికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది'' అని అచ్చెన్న హామీ ఇచ్చారు. 

''ప్రశ్నించిన వారిపై ఈ ప్రభుత్వ పెద్దలు కేసుు పెట్టిస్తున్నారు. రోడ్డెక్కి మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా పోరాటం వీడొద్దు. పోరాటం చేస్తేనే గుర్తింపు, స్వాతంత్ర్యం వస్తుందని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన ప్రజల బతుకులు బాగుపడతాయి. అందుకోసం కృషి చేయాలి'' అని టిడిపి నాయకులు, కార్యకర్తలకు అచ్చెన్న సూచించారు.