అమరావతి: గోదావరి నది మీద పోలవరం పూర్తి చేసుకొని అక్కడ నుంచి ఉత్తరాంద్ర సుజల స్రవంతి ద్వారా ఒరిస్సా బార్డర్ వరకు నీరు తీసుకువెళ్లాలని... పెన్నా నదితో అనుసంధానం చేయాలని చూశామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చాలని అనుక్షణం ప్రయత్నించామన్నారు. ఇందులోభాగంగా 69 ప్రాజెక్టులకు గాను 24 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించామన్నారు.

''తోటపల్లి రిజర్వాయర్ దగ్గరే పడుకొని పనులు పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమను వచ్చేలా చేసి అభివృద్ధి చేశాం. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసి నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం. తరువాత పురుషోత్తమపట్నం పూర్తికి ప్రయత్నించాం'' అని వెల్లడించారు. 

''జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన రెండేళ్లల్లో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు మించి ఖర్చు చేయలేదు. ఈ ప్రభుత్వ చేతగాని తనంతోనే గాలేరు నగరి ఊసేలేదు... హంద్రీ నీవా పనులు ఆగిపోయాయి. రివర్స్ టెండర్ పేరుతో ప్రాజెక్టులన్నింటిని రివర్స్ తీసుకువెళ్లారు. ఇలాగే సాగితే ప్రాజెక్టులు పూర్తి అవ్వటానికి కనీసం 100 ఏళ్లు పడుతుంది. సాగు నీటి ప్రాజెక్టులను అశ్రద్ధ చేసి, వవ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోతే అదే జగన్ రెడ్డికి శాపాలుగా మారతాయి'' అని మండిపడ్డారు.

read more ఎన్టీఆర్ కు భారతరత్న... మహానాడులో తీర్మానం: చంద్రబాబు వెల్లడి

''రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించాం. ఎడారిగా మారే అనంతపురం జిల్లాలో 8లక్షల ఫాంపాండ్స్ తొవ్వి నీరందించాం. భూగర్బ జలాలను పెంచాం. ఒక్క ఎకరాకు నీటి సమస్య లేకుండా చేయాలని ప్రతిక్షణం ప్రయత్నించాం. రాయలసీమ రాళ్లసీమ మారిపోతుందనే సమయంలో తెలుగుగంగ ద్వారా ఎన్టీఆర్ ఆశ చూపించారు. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం చేశారు. అదే బాటలో మేమూ నడిచాం" అన్నారు. 

''రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వ్యవసాయం పెరగాలి, పరిశ్రమలు పెరగాలి. వ్యవయసాయంలో వరుసగా 5 ఏళ్లు 11 శాతం జీఎస్డీపీ సాధించిన ఘనత టీడీపీదీ. పులివెందులకు నీళ్లందించి చీని చెట్టలను కాపాడాం. లక్షా 50వేల రుణమాఫీకి హామీనిచ్చి రూ.50వేల వరకు ఒకే సారి రుణమాఫీ చేశాం'' అని తెలిపారు. 

''వైసిపి సర్కారు రైతులకు అరకొర సాయం అందించి పత్రికా ప్రకటనలు ఇష్టానుసారంగా ఇస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు దగా చేశారు. సున్నావడ్డీ పేరు మీద అసెంబ్లీ సాక్షిగా తప్పుడు ప్రచారాలు చేశారు. ధాన్యం కొలుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి. బకాయిలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయారు'' అని ఆరోపించారు. 

''ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాజధాని ప్రాంతంలో రైతులను భాగస్వామ్యులం చేశాం. పోలవరం ప్రాజెక్టుకు ఒక్క ఎకరాల భూసేకరణ చేశారా? ఒక్క పునరావాసం కల్పించారా? పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లయితే ఇప్పటికే అమరావతి కంటిని పొడిచేశారు. పోలవరం పరిస్థితి కూడా అంతే'' అన్నారు.