కడప: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీరెడ్డి. జగన్ సర్కార్ లో ప్రభుత్వం సొమ్ము స్వాహా అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందంటూ మండిపడ్డారు. 

రైతులను ఆదుకుంటామని చెప్పిన జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు అయినా వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు భరోసా పథకంలో ప్రభుత్వం అనేక నిబంధనలు పెడుతోందని ధ్వజమెత్తారు. 

ప్రభుత్వం యెుక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాని ఆరోపించారు. కనీసం రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 

ఇకపోతే ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు కొండవీటి చాంతాడులా మారాయని మండిపడ్డారు. సలహాదారుల పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారని తులసిరెడ్డి ఘాటుగా విమర్శించారు.