ఒకవైపు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండగా... కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏవరితోనూ పొత్తులు పెట్టుకోదని తేల్చి చెప్పారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు స్పష్టం చేశాయని ఆయన తెలిపారు. రాష్ట్రప్రయోజనాలను నెరవేర్చే అంశంలో రాహుల్ గాంధీపైనా, కాంగ్రెస్ పార్టీపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

ప్రధానిగా ఆయన పదవిలోకి రాగానే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైలుపైనని కేవీపీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గెలిస్తే అది జరిగిందని ప్రజలు అనుకోవాలని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి చేసే దీక్షలు, ధర్నాలు వ్యక్తిగత స్వార్థంతోనే తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని రామచంద్రరావు ఆరోపించారు. ఏపీకి అన్యాయం జరిగిందని ఇప్పుడు చూపెడుతున్న కోపం, ఆవేశం, పెడబొబ్బలు పడుతున్న తాపాలు అన్ని ఎన్నికల ముంగిట ప్రజలను మెప్పించేందుకేనని ఆయన ఆరోపించారు.

వెన్నుపోటుతో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని లాక్కున్న చంద్రబాబు... ఇప్పుడు ఆయన నటనా వారసత్వానికి కూడా వారసులు తానేనని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.