కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. వైయస్ జగన్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిలా మారబోతోందని ఆరోపిస్తూ జలదీక్ష చేశారంటూ చెప్పుకొచ్చారు. 

కర్నూలు జిల్లాలో వైయస్ జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను వ్యతిరేకిస్తూ జలదీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అది ఆపకపోతే భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని జగన్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. 

అక్రమ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని లేని పక్షంలో భారత్, పాకిస్థాన్ లు ఎలా అయితే యుద్ధాలు చేసుకుంటున్నాయో అలాగే భవిష్యత్ లో నీటి కోసం తెలుగు రాష్ట్రాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని జగన్ అన్న విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ అంటూ ఆనాడు జగన్ అభివర్ణించారని నేడు ఆయన మంచి వ్యక్తి అయిపోయాడా అంటూ తులసిరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడును సైతం విమర్శించిన విషయం గుర్తు లేదా అని జగన్ ని ప్రశ్నించారు. 

కాళేశ్వరం పూర్తైతే ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుందని తెలిసి కూడా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తున్న జగన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తరని తులసిరెడ్డి నిలదీశారు.