తన తండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిని దుర్భాషలాడిన కేసీఆర్‌కు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారని ఎపి కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి తెలిపారు. జగన్ కు తండ్రి  వైఎస్ కంటే కేసీఆరే ఎక్కువయ్యారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ కు ఏపీలో అధికారంపై....తెలంగాణలో ఆస్తులపైనే ఎక్కువ ప్రేమ ఉందని ఆరోపించారు. అందువల్లే తెలంగాణ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సిపి కేసీఆర్ కు మద్దతిచ్చిందని తులసిరెడ్డి విమర్శించారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో వున్న వైఎస్సార్ సిపి ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డ టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపి అభివృద్ది కోసం  పనిచేస్తున్నట్లు నటిస్తూనే....అందుకు అడ్డుపడుతున్న వారికి సహకరించడం ఎంతవరకు న్యాయమో వైఎస్సార్ సిపి నాయకులే చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా వైసీపీ రెండు నాల్కల విధానం బయటపడిందని  తులసిరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో మాదిరిగానే ఏపిలో కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశంలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయా? అన్న ప్రశ్నను జవాబివ్వకుండా తులసి రెడ్డి దాటవేశారు. పొత్తులపై ఇంకా చర్చించలేదని...తమ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే పొత్తులుంటాయని తులసిరెడ్డి స్పష్టం చేశారు.