హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై వినతిపత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇకపోతే ఇటీవలే పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడ్డుకునేందుకు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంది టీడీపీ కాదా అంటూ ఆయన బహిరంగ లేఖలో విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు కేవీపీ లేఖపై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.  

పోలవరం ప్రాజెక్టు ఘనత తెలుగుదేశం పార్టీకే  దక్కుతుందని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా కేవీపీ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అటు దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా కౌంటర్ ఇచ్చారు కేవీపీ రామచంద్రరావు. పోలవరం ప్రాజెక్టుపై తాను రాసిన బహిరంగ లేఖపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డ విషయం తెలిసిందే. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి