ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల వ్యవహారంలో కొన్ని చోట్ల చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల వ్యవహారంలో కొన్ని చోట్ల చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. జగ్గంపేట మండలం గొల్లలకుంట గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధిగా ఖరారైన శ్రీనివాస్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

అతనికి మత్తు మందు ఇచ్చి.. కాళ్లు, చేతులు కట్టి అటవీ ప్రాంతంలో పడేశారు గుర్తు తెలియని దుండగులు. అయితే తన భర్తను కిడ్నాప్ చేసింది వైసీపీ నేతలేనని శ్రీనివాస్ రెడ్డి భార్య పుష్పవతి. అయితే పుష్పవతి ఆరోపణల్లో నిజం లేదంటున్నారు పోలీసులు. కిడ్నాప్‌పై తమకు ఫిర్యాదు అందలేదంటున్నారు జగ్గంపేట సీఐ.

అటు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్ధి అప్పన్నతో పాటు దువ్వాడ శ్రీనివాస్ రావడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దువ్వాడతో సహా నామినేషన్ వేసే అభ్యర్ధిని కేంద్రంలోకి రాకుండా అడ్డుకున్నారు టీడీపీ నేతలు. పోలీసులు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కాగా, రేపు ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుంది.

ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల తర్వాత ఉప సర్పంచ్‌ల ఎన్నిక ఉంటుంది.

తొలి దశలో 168 మండలాల్లో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా వుంచారు.