సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగా తన కుమారుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అయినప్పటికీ.. పవన్ ఎలాంటి సహాయం చేయలేదని ఓ బాధితుడు ఆరోపిస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల దేవరపల్లిలో పవన్  అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.  బైక్ ర్యాలీలో గోపాలపురం మండలం హుకుంపేటకి చెందిన మనోహర్ అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అయితే.. ర్యాలీలో ప్రమాదవశాత్తు మనోహర్ కిందపడగా.. అతనిపై నుంచి బైక్ లు దూసుకుపోయాయి.

తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... కిడ్నీ తొలగించారు. దాదాపు రూ.5లక్షలు అప్పు చేసి అతని తండ్రి మనోహర్ కి చికిత్స చేయించాడు. ఇప్పుడు మళ్లీ ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యలు చెబుతున్నారు. మరింత డబ్బు అవసరం అవుతుందని చెబుతున్నారని బాధితుడి తండ్రి తెలిపారు.

ప్రమాద ఫోటోలను పవన్ కళ్యాణ్ కి చూపించినప్పటికీ.. అతను స్పందించలేదని, కనీసం ఎలా ఉన్నాడని కూడా ఆరా తీయలేదని, ఆర్థిక సహాయం కూడా చేయలేదని మనోహర్ తండ్రి పేర్కొన్నారు. తన కుమారుడిని కాపాడుకోవడానికి దాతలు సహకరించాలంటూ అతను వేడుకుంటున్నాడు.